‘నెట్’ ఇంటి నుంచి... నట్టింట్లోకి...
ఏటా రూ.3వేల కోట్లకు పైగా ఆన్లైన్ వ్యాపారం
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ కావాలంటూ అమ్మానాన్నలకు ప్రణవ్ అప్లికేషన్... నిన్న ఓ టీవీ షోలో చూసిన న్యూ లుక్ డ్రెస్ కోసం సింధుజ తన మామయ్య రాకేష్ వద్ద గారాలు... ఓ కార్టూన్ చానెల్లోని బుజ్జిపాప పట్టుకున్న స్కూల్ బ్యాగ్ లాంటిదే తనకూ కావాలని చిన్నారి శ్రీహిత మారాం. అప్పుడెప్పుడో ఓ షాపులో చూసిన ఖరీదైన ల్యాప్‌టాప్‌కు భారీగా డి స్కౌంట్ అంటూ అదే సమయంలో రాకేష్‌కు సురేష్ ఫోన్. కొత్త డిజైన్ జ్యువెలరీ బాగుందని... అది కొంటే... రాగిణి ఇంట్లో జరిగే శుభకార్యానికి వేసుకోవచ్చని భర్త కరుణాకర్‌కు రాజేశ్వరి దరఖాస్తు...ఉన్నది ఒక్క ఆదివారమే. సమయమూ సరిపోదు. ఒకే రోజు...ఒకేసారి అందరికీ అన్ని వస్తువులూ కొనడమంటే తలకుమించిన పనే... సింధుజ సలహాతోఅంతా కలసి ఇంట్లోని కంప్యూటర్ ముందు వాలిపోయారు. ‘నెట్’ ఇంట్లోకి వెళ్లారు. నచ్చినవి ఆర్డర్ చేసుకున్నారు... అరగంటలో మొత్తం షాపింగ్ పూర్తయిపోయింది. అదీ ఆన్లైన్ మార్కెట్ మహిమ.
* ఇంటి ముంగిటికే సమస్తం
* ఆటవస్తువుల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు ఆన్లైన్ లోనే..
* నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ షాపింగ్
* మొబైల్ ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులదే సింహభాగం
* కొరియర్ సంస్థలకూ ఆదాయం
* వేలాది మందికి ఉపాధి
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ మార్కెటింగ్... ఓ సరికొత్త షాపింగ్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. కాలాన్నీ... డబ్బునూ... శ్రమనూ తగ్గిస్తోంది. కావాల్సిన వస్తువులన్నీ రోజుల వ్యవధిలో మన కళ్ల ముందుకు తీసుకువస్తోంది. అది కూడా ఎలాంటి తేడా లేకుండా. ఎంతో నమ్మకంగా. మార్కెట్ ధర కంటే తక్కువగా. అందమైన దుస్తులు మొదలుకొని... స్మార్ట్ఫోన్లు, నచ్చిన పుస్తకాలు... పిల్లల ఆటవస్తువులు... ఒకటేమిటి... కోరుకున్న ఏ వస్తువైనా క్షణాల్లో కొనేసే సదుపాయం ఇప్పుడు ‘క్లిక్’ దూరంలో ఉంది.
మన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన ఇంటర్నెట్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను సైతం మన ముంగిట్లో నిలుపుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో షాపింగ్‌కు వెళ్లే తీరిక... ఓపిక లేనివారికి ఇది ఓ వరంగా మారిందనడంలో సందేహం లేదు. నగరం దృష్టిని ఆన్లైన్ మార్కెట్ తొందరగానే తనవైపు తిప్పుకుంది. సాఫ్ట్వేర్ నిపుణులు, ఉన్నతోద్యోగులే కాదు... సగటు వేతన జీవులు... గృహిణులు... విద్యార్థులు సైతంవస్తువుల కోసం ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు.
నగరంలో కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ల వద్ద పెద్ద పెద్ద బ్యాగులు భుజాన వేసుకొని కోరుకున్న వస్తువులను ఇంటి ముందుకు తెచ్చిచ్చే డెలివరీబాయ్‌ల చేతుల్లో అత్యధికం ఆన్లైన్ మార్కెటింగ్ వస్తువులే. హైదరాబాద్ నగరంలో ఏటా రూ.3 వేల కోట్లకు పైగా ఆన్లైన్ వ్యాపారం జరుగుతోందని మార్కెట్ నిపుణుల అంచనా.
స్మార్ట్ఫోన్లు, దుస్తులదే అగ్రస్థానం..
నగర వాసులు ఎక్కువగా ఆన్లైన్లో స్మార్ట్ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే కొంత తక్కువ ధర... నాణ్యత, సేవలు సంతృప్తికరంగా ఉండడంతో చాలామంది ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత బ్రాండెడ్ దుస్తులది రెండో స్థానం. ఇక పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలు, గృహోపకరణాలు తరువాతి స్థానాల్లో ఉం టున్నాయి. హైదరాబాద్‌లో అత్యధిక ఆన్లైన్ మార్కెట్ కలిగిన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు తాము అందజేసే
వివిధ రకాల వస్తువులపై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రూ.3,500నుంచి రూ.5 వేల వరకు ఉండే బ్రాండెడ్ షూపైనా ఆన్లైన్ మార్కెట్లో 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వివిధ రకాల బ్రాండెడ్ దుస్తులపై కూడా 40 నుంచి 50శాతం డిస్కౌంట్ ఉంటోంది. మార్కెట్లో రూ.800కు లభించే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఆన్లైన్లో రూ.550 కే లభించడం విశేషం. ఎనిమిది గంటల పాటు విద్యుత్ సదుపాయం ఉండే సోలార్ లై ట్ ఆన్లైన్లో రూ. 1,400కే దొరుకుతోంది.
ఇలా సగటు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ధరల్లో వస్తువులు లభించడంతో అందరూ ఆన్లైన్ బాటలో నడుస్తున్నారు. 67 శాతం కొనుగోళ్లతో ఢిల్లీ మొదటి స్థానంలో, 60 శాతంతో ముంబయి రెండోస్థానంలో, 50శాతంతో బెంగళూర్ మూడో స్థానం లో ఉండగా, 40 శాతం ఆన్లైన్ మార్కెట్‌తో హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో తమ స్థానాన్ని పదిలపరచుకునేందుకు ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్, అరవింద్, లైఫ్ స్టైల్, వాల్‌మార్ట్, గోద్రెజ్ వంటి సంస్థలూ ఆన్లైన్ ఆర్డర్లకు శ్రీకారం చుట్టాయి.
యువతకు ఉపాధి...
సాఫ్ట్వేర్ నిపుణులు, మేనేజ్మెంట్ గురూలు మొదలుకొని వినియోగదారుల ఇంటి వద్దకు వచ్చి వస్తువులను అందజేసే డెలివరీ బాయ్స్ వరకు వేలాది మందికి ఆన్లైన్ మార్కెటింగ్ అద్భుతమైన ఉపాధి నిస్తోంది. ‘ఆన్లైన్ షాపింగ్ యాజమాన్యాలు, పోర్టళ్లకు యువతే మహారాజులు. వారిలోని నైపుణ్యాలను, సృజనాత్మకతను అంచనా వేసి సముచితమైన ప్రాధాన్యం ఇస్తున్నా’ మని ఈబే బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ హెడ్ వివేక్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం నగరంలో అన్ని ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్ల ఉద్యోగుల సంఖ్య 20 వేలపైనే ఉంది. డెలివరీ సిబ్బంది, కస్టమర్ సర్వీస్, వెబ్ యాప్ డెవలపర్లు, క్వాలిటీ నిపుణులు, కంటెంట్ రచయితలు, గ్రాఫిక్ డి జైనర్లు వంటి విభాగాల్లో పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ప్రవాసులు సైతం...
నగరంలోని తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు పంపించాలనుకునే ఎన్నారైలు సైతం ఇప్పుడు ఆన్లైన్నే ఎంచుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లోని తమ ఆప్తుల పుట్టిన రోజులు, పెళ్లి రోజుల వంటి శుభకార్యాలకు నగరానికి చెందిన వందలాది మంది ఉద్యోగులు, వ్యాపారులు బహుమతులు పంపించేందుకు ఆన్లైన్ మార్కెట్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ఆన్లైన్ బిజినెస్ ద్వారా డెలివరీ అవుతున్న వస్తువుల్లో ఎన్నారైల వాటా 25 శాతం ఉంటుందని కొరియర్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.
కొరియర్ సంస్థలకూ వరం
ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులను కొరియర్ సర్వీస్ ద్వారా సంబంధిత సంస్థలు వినియోగదారులకు చేరవేస్తున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు సొంతంగా కొరియర్ సంస్థలను కలిగి ఉంటే... మరి కొన్ని ఇతర కొరియర్ సంస్థలపైన ఆధార పడుతున్నాయి. దీంతో కొరియర్ సంస్థల వ్యాపారాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాపార రంగంలో హైదరాబాద్ 25 శాతం వాటా కలిగి ఉన్నట్లు అంచనా. నగరంలో వెయ్యికి పైగానే కొరియర్ సంస్థలు సేవలందిస్తున్నాయి. వీటిలో అరామెక్స్ ఇండియా, బ్లూ డాట్ ఎక్స్‌ప్రెస్, కాంటినెంటల్, డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, లాజిస్టిక్స్ వరల్డ్ వైడ్, ఫ్లయిట్ కొరియర్, ఓవర్ నైట్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు అనేకం ఉన్నాయి.
వినియోగదారుల సంతృప్తే కీలకం
ప్రతి రోజు 25 నుంచి 30 వస్తువులు అందజేస్తున్నాం. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో 50 వస్తువుల వరకు డెలివరీ అవుతాయి. శని, ఆది వారాలు మినహా మిగతా రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆలస్యమవుతుంది. ముఖ్యంగా బర్త్‌డే పార్టీలు, నచ్చిన వాళ్లకు బహుమతులు అందజేసే సమయాల్లో వినియోగదారుల నుంచి లభించే ప్రశంసలు మాకు కొండంత బలాన్ని ఇస్తాయి. పదోతరగతి చదువుకున్న నాలాంటి ఎంతోమందికి ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఉపాధినిస్తోంది. నెలకు రూ.10 వేల దాకా జీతం లభిస్తుంది.
- సురేష్‌బాబు, అమెజాన్ డెలివరీ బాయ్
క్లిక్‌తో అన్నీ ఇంటికే...
నాకు ఏది కావాలన్నా ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నా. దుస్తుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇలా చాలా వస్తువులు ఆన్లైన్లోనే కొన్నా. ఇంట్లో నుంచి కదలకుండా ఒక్క మౌస్ క్లిక్‌తో ఏదైనా కొనుక్కోవచ్చు. పైగా ఏ వస్తువు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో చూసుకుని మనకు నచ్చిన వాటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది.
- పి.మానస, విద్యార్థిని
సమయం, డబ్బూ ఆదా
ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఆన్లైన్ షాపింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. షాపింగ్‌కు వెళ్లి గంటల తరబడి తిరిగి అలసిపోయే పరిస్థితి ఉండదు. దర్జాగా ఇంట్లో కూర్చుని కావాల్సిన వస్తువులకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్ ధరల కంటే తక్కువకే లభిస్తాయి. ఎక్కువ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఆన్లైన్ షాపింగ్‌లో వివిధ ఆఫర్స్‌తో పాటు క్రెడిట్ కార్డు ఉపయోగించినపుడు రాయితీలు ఇస్తున్నారు.
- వై. కిరణ్, చార్టెడ్ అకౌంటెంట్
ఆకర్షణీయమైన ఆఫర్లు...
ఇటీవల ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ బాగా పెరిగింది. వీటికి సంబంధించిన వెబ్సైట్లు చాలానే ఉన్నాయి. పండుగల సందర్భంలో భారీ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు ఇవ్వడం వంటివి బాగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే లభిస్తుందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? ఈఎంఐ సౌకర్యం కూడా ఉండటంతో చాలామంది ఆన్లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. - మల్లీశ్వరి, గృహిణి