ఎన్జీ రంగా పాఠాలే పెద్ద బాలశిక్ష
తమిళనాడు గవర్నర్ రోశయ్య
తెనాలి : ఆచార్య ఎన్జీ రంగా పాఠాలే రాజకీయంగా తనకు పెద్ద బాలశిక్ష అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చెప్పారు. ప్రఖ్యాత పార్లమెంటేరియన్, రైతునాయకుడు ఆచార్య ఎన్జీ రంగా స్మారక అవార్డును ఆదివారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సభలో కొణిజేటి రోశయ్యకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి చేతుల మీదుగా బహూకరించారు. నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు ట్రస్ట్ నిర్వాహకురాలు, శాసనమండలి మాజీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి స్వాగతం పలికారు.
రోశయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో తన వాక్పటిమ రంగా రాజకీయ పాఠశాలలో అలవడిందేగానీ, ఏ పండితుల శిక్షణలోనూ అభ్యాసం చేసింది కాదన్నారు. అందరూ ఆపాదిస్తున్న ఘనతకు తాను అర్హుడిని కాదని చెబుతూ, రంగాగారు, నాకు మార్గదర్శకులైన పెద్దలకే ఆ ఔన్నత్యం దక్కాలన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చట్టసభల గౌరవాన్ని కాపాడిన రోశయ్య నుంచి, రాష్ట్ర శాసనమండలి కార్యక్రమాల పద్ధతి, పాటించాల్సిన సంప్రదాయాలను అలవరచుకొన్నట్టు చెప్పారు.
రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమ నిర్మాత ఎన్జీ రంగా సాహసోపేతమైన నేతగా చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పొన్నూరు చైర్పర్సన్ సజ్జా హైమావతి, మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు. స్వాతంత్య్రయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధిపతి అన్నాబత్తుని శివకుమార్, జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, మాణిక్యవేల్, ట్రస్ట్ ప్రతినిధులు కొసరాజు వెంకట్రాయుడు, ఆలపాటి మాధవరావు, జెట్టి అంకినీడు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు.