ఈ వీడియో చూసేటప్పుడు గుండె జాగ్రత్త
లండన్: యూట్యూబ్లో ఇప్పుడు ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. తన పైకి పాకిన ఎంతో విషపూరితమైన కట్లపాము నుంచి ఒక వ్యక్తి ఎలా బయటపడ్డాడో చూపించేదే ఆ వీడియో. ఈ వీడియోను హెడ్ఫోన్ పెట్టుకొని చూసే సమయంలో కచ్చితంగా ఓ చేత్తో గుండెను అదిమిపట్టుకోవాల్సిందే. దీనిని తదేకంగా చూస్తూ శ్వాసను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఒక పాము, ఓ యువకుడికి మధ్య అంత టెన్షన్ పూరిత పరిస్థితి ఆ వీడియోలో ఉంది.
నిక్ బిషప్ అనే యువకుడు ని ది రాంగ్లర్ పేరిట అటవీ జంతువులపై, పాములపై డాక్యుమెంటరీ తీసేందుకు అమెరికాలోని ఓ అడవి ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. అలా వెళుతూ ఓ చోట కూర్చోగా అతడి పక్కనే ఓ పెద్ద కట్ల పాము ఉంది. అది చూసి అతడి గుండె ఎగిసిపడింది. కొంచెం కదిలినా అది కరిచే ప్రమాదం ఉంది. దీంతో దానిని చిన్న కర్రపుల్ల తీసుకొని తొలుత తోకపై తాకించగా అది సర్రుమంటి మీదకు పాకింది. దీంతో అతడి గుండెదడ మరింత పెరిగింది. ఆ వెంటనే మరోసారి దాని నడుము భాగంలో తాకించి దానిని దారి మళ్లించి చాకచక్యంగా బయటపడి బతికిపోయాన్రా దేవుడా అనుకున్నాడు. ఈ వీడియోను దాదాపు 67లక్షలమంది చూశారు.