మాస్టర్ ఫండ్‌లో టెమసెక్ 2,750 కోట్ల పెట్టుబడులు
ముంబై: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్)లో సింగపూర్‌కు చెందిన టెమసెక్ హోల్డింగ్స్... రూ.2,750 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. తమ మాస్టర్ ఫండ్‌లో టెమసెక్ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్ఐఐఎఫ్ వెల్లడించింది. దీంతో తమ ఫండ్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య ఏడుకు చేరనున్నట్లు ఎన్ఐఐఎఫ్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుజోయ్ బోస్ చెప్పారు. ఈ ఫండ్‌లో ఇప్పటికే భారత ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ గ్రూప్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్‌లు ఇన్వెస్ట్ చేశాయి.
త్వరలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్...
కొత్త మౌలిక ప్రాజెక్ట్‌లు, ఇప్పటికే ప్రారంభమై, ఆగిపోయిన మౌలిక ప్రాజెక్ట్‌లకు నిధులందించేందుకు గాను ప్రభుత్వం ఎన్ఐఐఎఫ్ను 2015లో ఏర్పాటు చేసింది. ఎన్ఐఐఎఫ్లో కేంద్రానికి 49 శాతం చొప్పున వాటా ఉండగా, ఇతర వాటాలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఉన్నాయి. ఎన్ఐఐఎఫ్ ఇప్పటికే రెండు ఫండ్స్–మాస్టర్ ఫండ్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. మాస్టర్ ఫండ్ నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుండగా, ఇతర సంస్థలు నిర్వహించే ఫండ్స్‌లో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తోంది. తాజాగా 200 కోట్ల డాలర్ల నిధులతో మూడో ఫండ్–స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ మూడు ఫండ్ల ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని సుజోయ్‌బోస్ చెప్పారు. కాగా మౌలిక రంగ ఆస్తుల నిర్మాణానికి గాను దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా ఎన్ఐఐఎఫ్ త్వరతిగతిన అవతరిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.