విరాట్ కోహ్లిపై కేసు
బెంగళూరు: భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లిపై క్రీడా ఉత్పత్తుల సంస్థ నైకీ కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. ఒప్పంద నియమావళికి విరుద్ధంగా కోహ్లి వ్యవహరిస్తున్నాడని, తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘిస్తున్నాడని నైకీ కోర్టులో వాదించింది. దీన్ని విచారించిన కర్ణాటక హైకోర్టు... కోహ్లి మరో నాలుగు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పు ఇస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది. నైకీ సంస్థ కోహ్లిని 2008లో ప్రచారకర్తగా నియమించుకుంది.
ఐదేళ్ల కాలానికి మరో ఏడాది పొడిగింపుతో కూడిన ఒప్పందాన్ని అతనితో కుదుర్చుకుంది. ఇందులో ఐదేళ్ల ఒప్పందం జూలై 31, 2013తో ముగిసినప్పటికీ... క్లాజ్ ప్రకారం మరో ఏడాది పొడిగింపునకు అవకాశం ఉండటంతో వచ్చే ఏడాది వరకు కాంట్రాక్టు అమల్లో ఉండనుంది. ఈ మేరకు రూ. 1.42 కోట్లు నైకీ చెల్లించింది. అయితే కాంట్రాక్టు పొడిగింపు తనకు ఇష్టం లేదని ఆ సంస్థకు కోహ్లి లేఖ రాశాడు. క్రికెటర్ ఇలా అర్ధంతరంగా ప్లేటు ఫిరాయించడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన నైకీ సంస్థ కోర్టుకెక్కింది.