nikha halala
-
‘వాటిని షరియత్ అనుమతించింది’
సాక్షి, న్యూఢిల్లీ : నిఖా హలాల, బహుభార్యత్వాలు రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సవాల్ చేస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇవి ఏర్పడ్డాయని, వీటి చట్టబద్ధతను ప్రాథమిక హక్కుల పేరిట ఎవరూ ప్రశ్నించజాలరని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. తమ విశ్వాసాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క ముస్లిమేతరులనూ అనుమతించరాదని కోర్టులో దాఖలు చేసిన అప్లికేషన్లో తెలిపింది. బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేత, అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాథ్యాయ్ 2018 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహుభార్యత్వం దేశంలో చట్టవిరుద్ధమైనదే అయినా ముస్లిం పర్సనల్ లాబోర్డు (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937 ప్రకారం ముస్లిం వర్గానికి మినహాయింపు లభించిందని, నిఖా హలాలకూ ఇదే తరహాలో అనుమతిస్తున్నారని ముస్లిం లాబోర్డు పేర్కొంది. బహుభార్యత్వం కింద ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను వివాహం చేసుకోవచ్చు. ఇక 2017 ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చారిత్రక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు నిఖా హలాల, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణను వేరొక బెంచ్‌కు బదలాయించింది. -
సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు
లక్నో : విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్ తలాఖ్ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాచి పేర్కొన్నారు. ఇటువంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్(బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సోమవారం గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాధ్వి ప్రాచి.. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్) ఈసారి కూడా రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. ‘కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యాఖ్యలు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడి వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అంటూ మండిపడ్డారు. చదవండి : నిఖా హలాల పేరిట నరకం... -
‘గుండు కొట్టి దేశం నుంచి తరిమికొడితే..’
లక్నో: ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిదాఖాన్, ఫర్హాత్ నఖ్వీ లకు గుండు కొట్టి, దేశం దాటేలా తరిమి కొట్టే వారికి బరేలీ ముస్లిం ఎన్జీవో చీఫ్ మొయిన్ సిద్దిఖీ నూరీ నజరానా ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ ఇద్దరు మహిళలకు బుద్ధి చెప్పిన వారికి అక్షరాల 11, 786 రూపాయలు ముట్టజెప్పుతానని ఆలిండియా ఫైజాన్-ఎ-మదీన కౌన్సిల్ తరపున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, నిదా ఖాన్, ఫర్హాత్ నఖ్వీలను ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నట్టు నాలుగు రోజుల కిందట బరేలీ ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. అసలు విషయం.. నిఖా హలాల (మొదటి భర్తను మళ్లీ పొందాలంటే కొన్నాళ్లపాటు మరొకరితో కలిసి ఉండడం) కారణంగా చిత్రవధ అనుభవిస్తున్న సబీనాకు నిదాఖాన్ అండగా నిలిచారు. ఫర్హాత్ నఖ్వీతో కలిసి ట్రిపుల్ తలాక్, నిఖా హలాలకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేపట్టారు. దాంతో ఈ ఇద్దరిపై ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేశారు. తాజాగా, బరేలీలోని ముస్లిం ఎన్జీవో సైతం వారిని తరిమి కొట్టిన వారికి నగదు బహుమతి ప్రకటించడంతో దుమారం రేగుతోంది. మరోవైపు బరేలీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఎమెల్యే రాజేష్ కుమార్ మిశ్రా నేతృత్వంలో ఫర్హాత్, నిదాలు శనివారం కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఫర్హాత్ నఖ్వీ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సోదరి కావడం గమనార్హం. -
నిఖా హలాల పేరిట నరకం...
లక్నో : లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న నిఖా హలాల్, బహు భార్యత్వాల చట్ట బద్ధత గురించి చర్చించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి గత మార్చిలో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకు పలువురు బాధిత మహిళలు ముందుకొస్తున్నారు. నిఖా హలాల నియమం వల్ల తాము ఎంతటి క్షోభ అనుభవిస్తున్నామో చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు బరేలీకి చెందిన నీదా ఖాన్, షబీనా. నియమం పేరిట నరకం.. బరేలీకి చెందిన షబీనాకు ఓ వ్యక్తితో నిఖా జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆమె భర్త మూడు సార్లు తలాక్ చెప్పడంతో వారి వివాహం రద్దు అయింది. అయితే మళ్లీ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె భర్త, తన తండ్రిని పెళ్లి చేసుకోవాల్సిందిగా షబీనాను ఒత్తిడి చేశాడు. దీంతో భర్తతో విడాకులు పొందిన అనంతరం నిఖా హలాల నియమం ప్రకారం షబీనా ఆమె మామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత భర్త తండ్రితో విడాకులు పొంది, భర్తతో జీవితాన్ని పంచుకోవాలని భావించిన షబీనాకు.. తన సోదరుడిని వివాహం చేసుకోవాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు ఆమె మొదటి భర్త. దీంతో నియమం పేరిట తన జీవితంతో ఆటలాడుకుంటున్నారని గ్రహించిన షబీనా.. నీదా ఖాన్(బరేలీలో ప్రఖ్యాత దర్గా అలా హజ్రత్ కుటుంబానికి చెందిన మహిళ)ను కలిసి తన సమస్యను వివరించింది. నీదా కూడా షబీనా లాగే ట్రిపుల్ తలాక్ బాధితురాలు కావడంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపుతామని బెదిరింపులు.. నీదా ఖాన్, షబీనాలు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేయడాన్ని తట్టుకోలేని ‘పెద్దలు’ చంపుతామంటూ వారిని బెదిరించడంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన బరేలీ ఇమామ్ ముఫ్తీ ఖుర్షీద్ ఆలం మాట్లాడుతూ... కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే కావాలనే కొందరు ఇస్లాం నియమాలను మంటగలపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందినీ షరియత్ చట్టాల ప్రకారం పని గట్టుకొని బహిష్కరించాల్సిన పని లేదని, అలా మాట్లాడిన మరుక్షణమే వారు ఇస్లాం వ్యతిరేకులుగా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నియమాల పేరిట ఆటవిక చర్యలకు పాల్పడం సరికాదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
‘బహుభార్యత్వం, నిఖా హలాల’పై కేంద్రానికి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాంలో అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన సమీనా బేగం, బీజేపీ నేత, సామాజిక కార్యకర్త అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ, మరో నలుగురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. మరోవైపు ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించాలని సుప్రీంలో గట్టిగా వాదించిన కేంద్రం ఈ అంశాలపై ఎలాంటి కౌంటర్‌తో ముందుకు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. -
‘తలాక్’ రాజ్యాంగ ధర్మాసనానికి..
అప్పగించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. దీని కోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని, ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని, అందువల్ల విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. కాగా, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (1), ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది.