సాక్షి, న్యూఢిల్లీ : నిఖా హలాల, బహుభార్యత్వాలు రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సవాల్ చేస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇవి ఏర్పడ్డాయని, వీటి చట్టబద్ధతను ప్రాథమిక హక్కుల పేరిట ఎవరూ ప్రశ్నించజాలరని ఏఐఎంపీఎల్‌బీ పేర్కొంది. తమ విశ్వాసాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క ముస్లిమేతరులనూ అనుమతించరాదని కోర్టులో దాఖలు చేసిన అప్లికేషన్‌లో తెలిపింది.
బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేత, అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాథ్యాయ్ 2018 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహుభార్యత్వం దేశంలో చట్టవిరుద్ధమైనదే అయినా ముస్లిం పర్సనల్ లాబోర్డు (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937 ప్రకారం ముస్లిం వర్గానికి మినహాయింపు లభించిందని, నిఖా హలాలకూ ఇదే తరహాలో అనుమతిస్తున్నారని ముస్లిం లాబోర్డు పేర్కొంది. బహుభార్యత్వం కింద ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను వివాహం చేసుకోవచ్చు. ఇక 2017 ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చారిత్రక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు నిఖా హలాల, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్‌ల విచారణను వేరొక బెంచ్‌కు బదలాయించింది.
Comments
Please login to add a commentAdd a comment