polygomy
-
‘వాటిని షరియత్ అనుమతించింది’
సాక్షి, న్యూఢిల్లీ : నిఖా హలాల, బహుభార్యత్వాలు రాజ్యాంగ విరుద్ధమైనవని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సవాల్ చేస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇవి ఏర్పడ్డాయని, వీటి చట్టబద్ధతను ప్రాథమిక హక్కుల పేరిట ఎవరూ ప్రశ్నించజాలరని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. తమ విశ్వాసాలను ప్రశ్నించేందుకు ఏ ఒక్క ముస్లిమేతరులనూ అనుమతించరాదని కోర్టులో దాఖలు చేసిన అప్లికేషన్లో తెలిపింది. బహుభార్యత్వం, నిఖా హలాలను రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేత, అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాథ్యాయ్ 2018 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహుభార్యత్వం దేశంలో చట్టవిరుద్ధమైనదే అయినా ముస్లిం పర్సనల్ లాబోర్డు (షరియత్) అప్లికేషన్ యాక్ట్, 1937 ప్రకారం ముస్లిం వర్గానికి మినహాయింపు లభించిందని, నిఖా హలాలకూ ఇదే తరహాలో అనుమతిస్తున్నారని ముస్లిం లాబోర్డు పేర్కొంది. బహుభార్యత్వం కింద ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను వివాహం చేసుకోవచ్చు. ఇక 2017 ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చారిత్రక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు నిఖా హలాల, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణను వేరొక బెంచ్‌కు బదలాయించింది. -
నిఖా హలాల పేరిట నరకం...
లక్నో : లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న నిఖా హలాల్, బహు భార్యత్వాల చట్ట బద్ధత గురించి చర్చించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి గత మార్చిలో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకు పలువురు బాధిత మహిళలు ముందుకొస్తున్నారు. నిఖా హలాల నియమం వల్ల తాము ఎంతటి క్షోభ అనుభవిస్తున్నామో చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు బరేలీకి చెందిన నీదా ఖాన్, షబీనా. నియమం పేరిట నరకం.. బరేలీకి చెందిన షబీనాకు ఓ వ్యక్తితో నిఖా జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆమె భర్త మూడు సార్లు తలాక్ చెప్పడంతో వారి వివాహం రద్దు అయింది. అయితే మళ్లీ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె భర్త, తన తండ్రిని పెళ్లి చేసుకోవాల్సిందిగా షబీనాను ఒత్తిడి చేశాడు. దీంతో భర్తతో విడాకులు పొందిన అనంతరం నిఖా హలాల నియమం ప్రకారం షబీనా ఆమె మామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత భర్త తండ్రితో విడాకులు పొంది, భర్తతో జీవితాన్ని పంచుకోవాలని భావించిన షబీనాకు.. తన సోదరుడిని వివాహం చేసుకోవాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు ఆమె మొదటి భర్త. దీంతో నియమం పేరిట తన జీవితంతో ఆటలాడుకుంటున్నారని గ్రహించిన షబీనా.. నీదా ఖాన్(బరేలీలో ప్రఖ్యాత దర్గా అలా హజ్రత్ కుటుంబానికి చెందిన మహిళ)ను కలిసి తన సమస్యను వివరించింది. నీదా కూడా షబీనా లాగే ట్రిపుల్ తలాక్ బాధితురాలు కావడంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపుతామని బెదిరింపులు.. నీదా ఖాన్, షబీనాలు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేయడాన్ని తట్టుకోలేని ‘పెద్దలు’ చంపుతామంటూ వారిని బెదిరించడంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన బరేలీ ఇమామ్ ముఫ్తీ ఖుర్షీద్ ఆలం మాట్లాడుతూ... కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే కావాలనే కొందరు ఇస్లాం నియమాలను మంటగలపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందినీ షరియత్ చట్టాల ప్రకారం పని గట్టుకొని బహిష్కరించాల్సిన పని లేదని, అలా మాట్లాడిన మరుక్షణమే వారు ఇస్లాం వ్యతిరేకులుగా మారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నియమాల పేరిట ఆటవిక చర్యలకు పాల్పడం సరికాదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
ఇప్పుడు నిఖా హలాల్ వంతు
న్యూఢిల్లీ : ముస్లింల వివాదాస్పద విడాకుల చట్టం ‘ట్రిపుల్ తలాక్’ను చట్టబద్దం కాదని తేల్చిన కేంద్రం ఇప్పుడు ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల చట్టబద్దతలను పరిశీలించనున్నట్లు సమాచారం. ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల ప్రామణికతను సవాలు చేస్తూ గతంలో సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ‘ట్రిపుల్ తలాక్’ అంశంతో పాటే వీటిని కూడా పరిశీలించాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కానీ సుప్రీం కోర్టు ముందు ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారించిన తర్వాత నిఖా హలాల్ అంశాలను చర్చిస్తానని తెలిపింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ అంశాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘నిఖా హలాల్, బహుభార్యత్వం అంశాలు లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి సుప్రీం కోర్టు వీటి చట్టబద్దతను విచారించనుంద’ని ఒక సీనియర్ న్యాయాధికారి తెలిపారు. గతేడాది ‘ట్రిపుల్ తలాక్’ అంశం చట్టవిరుద్దమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ‘నిఖా హలాల్, బహుభార్యత్వం’ అంశాల గురించి చర్చించేందుకు ఈ ఏడాది మార్చ్‌లో సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘కేంద్రం తన మాటకు కట్టుబడి ఉంటుంది. నిఖా హలల, బహుభార్యత్వం వంటి అంశాలకు భారత ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇదే అంశాన్ని తెలుపుతుంద’ని ఒక సీనియర్ న్యాయశాఖ అధికారి తెలిపారు. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
‘బహుభార్యత్వం, నిఖా హలాల’పై కేంద్రానికి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాంలో అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన సమీనా బేగం, బీజేపీ నేత, సామాజిక కార్యకర్త అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ, మరో నలుగురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. మరోవైపు ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించాలని సుప్రీంలో గట్టిగా వాదించిన కేంద్రం ఈ అంశాలపై ఎలాంటి కౌంటర్‌తో ముందుకు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. -
'నీళ్లు కావాలంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకోండి'
నీటి సమస్య ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సరికొత్త పరిష్కారం సూచించారు. ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని, వాళ్లలో ఒకళ్లు పిల్లలను కంటే, మిగిలిన ఇద్దరు నీళ్లు తెస్తారని జతారా ఎస్డీఎం బీకే పాండే ఉచిత సలహా ఇచ్చారు. తాను బైర్వార్ గ్రామం మీదుగా వెళ్తుంటే రాత్రి 2 గంటలకు కూడా మహిళలు వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం చూశానని, ఇది చాలా పెద్ద సమస్య అని ఆయన అన్నారు. అందుకే.. భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు మంచినీళ్లు కావాలనుకుంటే ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని చెప్పుకొచ్చారు. అయితే.. అంతగా డబ్బు లేనివాళ్లు మాత్రం మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే భరించడం కష్టం అవుతుందని జాగ్రత్తలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. బుందేల్‌ఖండ్ ప్యాకేజి కింద వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. గడిచిన నెలలో వీధిపంపు వద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మరణించింది.