న్యూఢిల్లీ : ముస్లింల వివాదాస్పద విడాకుల చట్టం ‘ట్రిపుల్ తలాక్’ను చట్టబద్దం కాదని తేల్చిన కేంద్రం ఇప్పుడు ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల చట్టబద్దతలను పరిశీలించనున్నట్లు సమాచారం. ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల ప్రామణికతను సవాలు చేస్తూ గతంలో సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్‌లు దాఖలయ్యాయి. అయితే ‘ట్రిపుల్ తలాక్’ అంశంతో పాటే వీటిని కూడా పరిశీలించాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కానీ సుప్రీం కోర్టు ముందు ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారించిన తర్వాత నిఖా హలాల్ అంశాలను చర్చిస్తానని తెలిపింది.
అందులో భాగంగా ప్రస్తుతం ఈ అంశాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘నిఖా హలాల్, బహుభార్యత్వం అంశాలు లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి సుప్రీం కోర్టు వీటి చట్టబద్దతను విచారించనుంద’ని ఒక సీనియర్ న్యాయాధికారి తెలిపారు. గతేడాది ‘ట్రిపుల్ తలాక్’ అంశం చట్టవిరుద్దమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ‘నిఖా హలాల్, బహుభార్యత్వం’ అంశాల గురించి చర్చించేందుకు ఈ ఏడాది మార్చ్‌లో సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
‘కేంద్రం తన మాటకు కట్టుబడి ఉంటుంది. నిఖా హలల, బహుభార్యత్వం వంటి అంశాలకు భారత ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇదే అంశాన్ని తెలుపుతుంద’ని ఒక సీనియర్ న్యాయశాఖ అధికారి తెలిపారు.
నిఖా హలాల్...
ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment