'నీళ్లు కావాలంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకోండి'
నీటి సమస్య ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సరికొత్త పరిష్కారం సూచించారు. ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని, వాళ్లలో ఒకళ్లు పిల్లలను కంటే, మిగిలిన ఇద్దరు నీళ్లు తెస్తారని జతారా ఎస్డీఎం బీకే పాండే ఉచిత సలహా ఇచ్చారు. తాను బైర్వార్ గ్రామం మీదుగా వెళ్తుంటే రాత్రి 2 గంటలకు కూడా మహిళలు వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం చూశానని, ఇది చాలా పెద్ద సమస్య అని ఆయన అన్నారు.
అందుకే.. భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు మంచినీళ్లు కావాలనుకుంటే ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని చెప్పుకొచ్చారు. అయితే.. అంతగా డబ్బు లేనివాళ్లు మాత్రం మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే భరించడం కష్టం అవుతుందని జాగ్రత్తలు చెప్పారు. మధ్యప్రదేశ్లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. బుందేల్ఖండ్ ప్యాకేజి కింద వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. గడిచిన నెలలో వీధిపంపు వద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మరణించింది.