అప్పగించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. దీని కోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని, ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని, అందువల్ల విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. కాగా, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (1), ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది.