nikhath Zarin
-
Boxing World Championships: నిఖత్ జరీన్ పంచ్ అదిరెన్..
ఇస్తాంబుల్: తన పంచ్ పవర్ చాటుకుంటూ భారత బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ తెలంగాణ బాక్సర్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ 5–0తో చార్లీ సియాన్ డేవిసన్ (ఇంగ్లండ్)పై ఘనవిజయం సాధించింది. నిఖత్‌తోపాటు మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించి భారత్‌కు పతకాలను ఖరారు చేశారు. క్వార్టర్ ఫైనల్లో మనీషా 4–1తో నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై, పర్వీన్ 5–0తో షోయిరా జుల్కనరోవా (తజికిస్తాన్)పై విజయం సాధించారు. మరోవైపు భారత్‌కే చెందిన నీతూ (48 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), అనామిక (50 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), నందిని (ప్లస్ 81 కేజీలు) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో నీతూ 2–3తో అలు బల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో... పూజా 2–3తో జెస్సికా బాగ్లే (ఆస్ట్రేలియా) చేతిలో... అనా మిక 0–5తో ఇంగ్రిట్ లొరెనా (కొలంబియా) చేతిలో... జాస్మిన్ 1–4తో షకీలా రషీదా (అమెరికా) చేతిలో... నందిని 0–5తో ఖైజా మర్దీ (మొరాకో) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. బల్గేరియాలోని సోఫియాలో శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో నిఖత్ ఇటలీకి చెందిన మార్చిస్ గియోవానాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రెండు రౌండ్లలో నిఖత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. చివరిదైన మూడో రౌండ్ ఆరంభంలో నిఖత్ పంచ్‌ల ధాటికి గియోవానా ఎదురు నిలువ లేకపోయింది. దాంతో రిఫరీ బౌట్‌ను మధ్యలో నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాథెర్ (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), ప్విలావో బాసుమతారి (64 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సోనియా 5–0తో జెలెనా జెకిచ్ (సెర్బియా)పై... జెస్సికా మెసినా (ఆస్ట్రేలియా)పై లవ్లీనా... బాసుమతారి 3–2తో మెలిస్ (బల్గేరియా)పై గెలిచారు. పురుషుల విభాగంలో మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), హర్‡్ష లాక్రా (81 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
శ్రీజ–నిఖత్ జంటకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ బాను (తెలంగాణ) జంట స్వర్ణంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–నిఖత్ ద్వయం 11–2, 11–8, 8–11, 11–7తో అనన్య బసక్–సృష్టి (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. సెమీఫైనల్లో శ్రీజ–నిఖత్ జంట 7–11, 11–7, 15–13, 13–11తో అహిక– ప్రాప్తి సేన్ (పశ్చిమ బెంగాల్) జోడీని ఓడించింది. -
నిఖత్‌కు పతకం ఖాయం
రోహ్తక్: జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అభాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో నిఖత్ అలవోక విజయం సాధించింది. మాజీ ప్రపంచ చాంపియన్ సరితా దేవి (60 కేజీలు), ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత సోనియా లాథెర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు), సర్జూబాలా దేవి (48 కేజీలు) కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. మరోవైపు భారత బాక్సింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మహిళా బాక్సర్ల ప్రతినిధిగా సరితా దేవి ఎన్నికైంది. -
పంచ్ అదిరింది
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 3-0తో ఎరికా అడ్జెయి (కెనడా)ను ఓడించింది. ఏకపక్షంగా జరిగిన ఈ బౌట్లో నిఖత్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా (57 కేజీలు), సవీటి బోరా (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సోనియా 3-0తో నోమిన్ డ్యూష్ (జర్మనీ)పై, సవీటి 2-1తో కెబికవా (బెలారస్)పై నెగ్గారు. అయితే 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో పూజా రాణి 0-3తో సవన్నా మార్షల్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. రియో ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లకు 51, 60, 75 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. అయితే ఈసారి భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు.