పంచ్ అదిరింది
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 3-0తో ఎరికా అడ్‌జెయి (కెనడా)ను ఓడించింది. ఏకపక్షంగా జరిగిన ఈ బౌట్‌లో నిఖత్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది.
మరోవైపు భారత్‌కే చెందిన సోనియా (57 కేజీలు), సవీటి బోరా (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సోనియా 3-0తో నోమిన్ డ్యూష్ (జర్మనీ)పై, సవీటి 2-1తో కెబికవా (బెలారస్)పై నెగ్గారు. అయితే 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో పూజా రాణి 0-3తో సవన్నా మార్షల్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. రియో ఒలింపిక్స్‌లో మహిళా బాక్సర్లకు 51, 60, 75 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. అయితే ఈసారి భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు.