తప్పుల్లేని ఈసీకి సులువైన మార్గం!
సాక్షి, హైదరాబాద్: ఈసీ.. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీల కమైన పత్రం. మనం కొనాల నుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంత కీలకమైన పత్రంలో తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవడమెలాగో చూడండి.
ఒక ప్లాటు కొనాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు దాని పూర్త చరిత్ర గురించి తెలుసుకోవాలి. లేకపోతే మన కష్టార్జితాన్ని బూడిదలో పోసినట్లే. మరి అసలైన ఈసీ కావాలంటే ఆయా స్థలానికి సంబంధించిన వివరాలను తప్పుల్లేకుండా క్షుణ్నంగా, స్పష్టంగా రాయాలి. లేకపోతే తప్పుడు పత్రం వస్తుంది. తెలియక జరిగిన పొరపాటు వల్ల అంతిమ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. మన సొమ్మును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది.
ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీరణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులాగల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు.
ఇక్కడే తప్పు చేస్తారు..
చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాల్ని అందజేస్తుంది. అందుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే.
ఒక సర్వే నంబరలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉందనుకుందాం. వాటిలో వెంచర్ వేశాడనుకుందాం. పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్ముడవుతాయి. సహజంగానే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. కొన్నాళ్ల తర్వాత ఎవరైనా అందులో ప్లాటు కొనాలనుకుని ఐదెకరాల విస్తీర్ణం, సర్వే నంబరు, గ్రామం, మండలం, హద్దులు రాసి ఈసీకి దరఖాస్తు చేసుకుంటే నిల్ ఈసీ వస్తుంది. కాకపోతే అప్పటికే అందులో పలువురు ప్లాటు కొనేసి ఉంటారు.
మరి ఈసీలో ఈ వివరాలు ఎందుకు రాలేదంటే.. విస్తీర్ణం ఐదు ఎకరాలని రాశారు కాబట్టి. కంప్యూటర్ కేవలం ఆయా భూమిపై రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్నది మాత్రమే చూపిస్తుంది. గంపగుత్తగా ఐదెకరాలు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. ఆయా సర్వే నంబరుకు సంబంధించిన పూర్తి వి వరాలు కావాలని అడగాలి. అప్పుడే పక్కా వివరాలు వస్తాయి.
కొందరేం చేస్తారంటే.. 2 వేల గజాల స్థలాన్ని 200 గజాల చొప్పున పది మందికి అమ్ముతారు. అయితే 2 వేల గజాలకు సంబంధించి ఒకేసారి స్థల మార్పిడి జరగలేదు కాబట్టి ఈసీ కోసం దరఖాస్తు చేస్తే నిల్ ఈసీ వ స్తుంది. ఆ ఆస్తికి సంబంధించి ఎన్ని లావాదేవీలు జరిగాయని రాస్తేనే సరైన సమాచారం అందుతుంది.