పెళ్లి తర్వాత ప్రేమ.. అనాలోచిత నిర్ణయం తెచ్చిన అనర్థం
నిమ్మనపల్లె (అన్నమయ్య జిల్లా): ఒక్క అనాలోచిత నిర్ణయం..నిండు జీవితాన్ని బలితీసుకుంది. ఉన్నతంగా చదువుకొన్న విద్యాధికులు ఉన్నంతంగా ఆలోచించలేకపోవడం...చదువుతో పాటు నేర్చుకోలేని సంస్కారం.. కారణంగా రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. యువతి వందేళ్ల జీవితం మూడు నెలల కాలానికే మృత్యువుకు అర్పితమైంది. వైవాహిక జీవితంపై సరైన అవగాహన లేక ..పెళ్లి తరువాత ప్రేమిస్తే వచ్చే అనర్థాలను గుర్తించలేక ఒకరు ప్రాణాలను కోల్పోతే..మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు... మరొకరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహారంపంచాయితీ రెడ్డివారిపల్లెకు చెందిన యువతి మూగలమర్రి హర్పిత(27), అనాలోచిత నిర్ణయం నేపథ్యం..రెడ్డివారిపల్లె గ్రామంలోని ఎం.నరసింహులు, క్రిష్ణమ్మ దంపతులకు కుమారుడు అరవింద్, కుమార్తె హర్పితలు ఉన్నారు. తండ్రి నరసింహులు వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో లాండ్రీషాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు తిరుపతిలో ప్రైవేట్‌జాబ్ చేస్తుండగా, హర్పిత సైతం తిరుపతిలోని జ్యువలరీ షాపులో సేల్స్‌గర్లగా పనిచేస్తోంది. తెలుగు సబ్జెక్టులో బీఎడ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది.
ఈమెకు గత మార్చి నెల20వ తేదీన చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊరుకు చెందిన జాషువాతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరి మధ్య సఖ్యతలేకుండా పోయింది. కారణం..ఆమెకు పుంగనూరు మేలుపట్ల చెందిన రాజేష్‌రెడ్డితో పరిచయం ఉండటమే. మేలుపట్లకు చెందిన వెంకటరమణారెడ్డికి రాజేష్‌రెడ్డి సొంత కొడుకు కాగా, జాషువాను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. జాషువా పౌల్ట్రీ రంగంలో పనిచేస్తూ నిమ్మనపల్లె మండలంలో కోళ్ల ఫారాలకు అవసరమైన మందులు సరఫరా చేస్తూ ఉండేవాడు. రాజేష్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో స్కిల్‌డెవలప్‌మెంట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో రెడ్డివారిపల్లెకు చెందిన హర్షితతో జాషువాకు పెళ్లి నిశ్చతమైంది. అయితే పెళ్లిచూపుల సమయంలో, షాపింగ్‌లో, ఫంక్షన్లో వీరిద్దరూ హర్పితతో కలిసి తిరిగారు. ఈ సమయంలో రాజేష్‌రెడ్డితో హర్పితకు పరిచయం ఏర్పడి బలపడింది. జాషువాతో పెళ్లి జరిగిపోయింది. భర్తపై నిరాసక్తత ప్రదర్శించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. విషయం తెలిసిన రాజేష్‌రెడ్డి తల్లి హర్పితను మందలించింది. భర్తతో సఖ్యతగా ఉండాలంటూ సూచించింది. అయితే ఆ మాటలను పెడచెవిన పెట్టింది. రాజేష్‌రెడ్డితో పరిచయం కొనసాగించింది. యధావిధిగా తిరుపతిలోని జ్యువలరీషాపులో పనిచేస్తూ అక్కడే ఉంటోంది.
ప్రమాద నేపథ్యం
ఈనెల13వ తేదీ సోమవారం రాత్రి రాజేష్‌రెడ్డి ఇంటి వద్ద రూ.లక్ష నగదు తీసుకుని కారుతోపాటు అదృశ్యమయ్యాడు. కుమారుడి అదృశ్యంపై తండ్రి వెంకటరమణారెడ్డి పుంగనూరు పోలీస్టేషన్లో14వ తేదీ ఫిర్యాదు చేశాడు. రాజేష్‌రెడ్డి ఉపయోగించిన కారు మదనపల్లెలోని దేవతానగర్ వద్ద పోలీసులు గుర్తించారు. కారులో సీట్లుకాలిపోవడం, పెట్రోల్ , డీజిల్ వాసన రావడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజేష్‌రెడ్డి ఉన్న లొకేషన్ గుర్తించి తండ్రి వెంకటరమణారెడ్డి, పుంగనూరు పోలీసులు ఇన్నోవా వాహనంలో విజయవాడకు వెళ్లారు.
అక్కడ రాజేష్‌రెడ్డితో హర్పిత ఉండడం గుర్తించారు. వారిని తీసుకుని వస్తుండగా ఒంగోలు వద్ద హైవేపై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొని , లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హర్పిత అక్కడికక్కడే మృతి చెందింది. రాజేష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్ తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఒంగోలు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతదేహం రాక ఆలస్యం
శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హర్పిత మృతదేహం శనివారం రాత్రి వరకు స్వగ్రామం రెడ్డివారిపల్లెకు చేరుకోలేదు. తండ్రి నరసింహులు సోదరుడు అరవింద్ శుక్రవారమే ఒంగోలుకు వెళ్లారు. మృతదేహంకోసం గ్రామంలోకుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. హర్పిత తెలుగు బీఎడ్ పూర్తి చేసింది. రాజేష్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఉన్నతంగా చదువుకున్నా ఉన్నతంగా ఆలోచించలేకపోయారు. చదువుతోపాటు నేర్చుకున్న సంస్కారాన్ని మరిచిపోవడంతోఒకరు తనువు చాలిస్తే, మరొకరు సమాజంలో గౌరవం కోల్పోవాల్సి వచ్చింది. మరొకరి జీవితం ప్రశ్నార్థకం అయింది.
పెళ్లి తర్వాత ప్రేమ అనర్థమే..
పెళ్లి తరువాత ప్రేమైనా వ్యామోహమైనా , అక్రమ సంబంధాలైనా అనర్థాలే తెచ్చిపెడుతాయి. వీటివల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న జంటలను నిత్యం చూస్తున్నాం. ఇప్పటికైనా యువతీ యువకుల ఆలోచనలోమార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది