'ఆ మతగురువు ఉరిపై మూల్యం చెల్లించుకోకతప్పదు'
టెహ్రాన్: సౌదీ అరేబియాలో ప్రముఖ షియా మతగురువు నిమ్ర్ అల్ నిమ్ర్‌ను ఉరితీయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇందుకుగాను సౌదీ అరేబియా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ హెచ్చరించింది. మతగురువు నిమ్ర్‌ను శనివారం ఉరితీయడాన్ని ఖండించింది. షియా ప్రాబల్య దేశమైన ఇరాన్.. నిమ్ర్‌కు క్షమాభిక్ష పెట్టాలని పలుమార్లు సున్నీ ఆధిక్య దేశమైన సౌదీకి విజ్ఞప్తి చేసింది.
ఉగ్రవాదులు, తీవ్రవాదులకు మద్దుతుగా ఉండే సౌదీ ప్రభుత్వం సొంతదేశంలో మాత్రం చిన్న విమర్శలు తట్టుకోలేకపోతున్నదని, విమర్శకుల పట్ల అణచివేత, ఉరితీతల ధోరణి వ్యవహరిస్తున్నదని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ జబెర్ అన్సరీ మండిపడ్డారు. సౌదీలోని తూర్పు ప్రావిన్స్‌లో 2011లో పెద్ద ఎత్తున తలెత్తిన నిరసనలు, ఆందోళనల వెనుక నిమ్ర్ (56) ప్రధాన పాత్ర పోషించారు. ఇక్కడ షియా వర్గం ప్రజలు పెరిగిపోవడం సున్నీలు మైనారిటీలుగా మారుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.