సౌదీలో 47 మందికి ఉరిశిక్ష అమలు
రియాద్: ప్రముఖ మత గురువు షేక్ నిమిర్ ఆల్ నిమిర్ సహా 47 మందికి శనివారం మరణదండన అమలు చేసినట్లు సౌదీ అరేబియా హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే వారికి శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తూ 2003-2006 మధ్యకాలంలో ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులకు ఈ శిక్ష అమలు చేశామని ప్రభుత్వం పేర్కొంది.
2015 ఏడాదిలో 158 మందికి పైగా మరణశిక్ష అమలు చేశామని ఓ అధికారి స్థానిక మీడియాతో చెప్పారు. అందులో కేవలం నవంబర్ లోనే 45 మంది విదేశీయులు సహా 63 మందికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాకు సంబంధించి మరణశిక్ష పడింది. గతంలో 1995లో అత్యధికంగా 192 మందికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.