కిమ్ దెబ్బ: బంగారం ధరలు జూమ్
సాక్షి,న్యూఢిల్లీ: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడంతో గ్లోబల్‌మార్కెట్లు వెనకడుగు వేయగా బంగారం ధరలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. మంగళవారం పసిడి ధరలు గ్లోబల్‌గా తొమ్మిదిన్నర నెలల గరిష్టాన్ని నమోదుచేశాయి. అటు దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. రూ.108 పుంజుకుని రూ. 29 275 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. వెండి సెప్టెంబర్ డెలివరీ కేజీ రూ. 124 బలపడి రూ. 39,851 వద్ద కదులుతోంది.
అంతర్జాతీయంగా బంగారం 0.5 శాతం పెరిగి 1,316.66 డాలర్ల స్థాయికి పెరిగింది. గత ఏడాది నవంబర్ నాటి 1,322.33 డాలర్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. గత సెషన్లో ఇది 1.4 శాతం పెరిగింది. డిసెంబరు డెలివరీ అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి ఔన్సుకు 1,322.20 డాలర్ల వద్ద ఉంది.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై భూగోళ రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది. ముఖ్యంగా డాలర్, ఈక్విటీలపై భారీగా పడగా అమెరికా స్టాక్ ఫ్యూచర్స్, ఆసియన్ షేర్ మార్కెట్ల పతనమయ్యాయి. అయితే జపాన్ ఎన్ విలువ డాలర్‌కు వ్యతిరేకంగా నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
మరోవైపు ఉత్తర కొరియా ఉత్తర ద్వీపకల్పం మీదుగా పసిఫిక్ జలాల్లో బాలిస్ట్‌క్ మిస్సైల్‌ను ప్రయోగించిందని దక్షిణ కొరియా జపాన్ ప్రకటించాయి. మిస్సైల్ జపాన్ దేశంగుండా ప్రయాణించడంతో జపాన్ ప్రధాని షింజో అబే ఉత్తర కొరియాపై మండిపడ్డారు. ఇది కొరియా ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమని వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ఆసియాలో పలు మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ 250పాయింట్లకు పైగా పతనమైంది.
ఉత్తర కొరియా- అమెరికా మధ్య యుద్ధమేఘాలు, అమెరికా రుణ పరిమితి పెంపుపై అనిశ్చితి, వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ అస్పష్టత వంటి అంశాల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 14 శాతం లాభపడడవం గమనార్హం. మరోవైపు ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఐసీఈఎక్స్) సోమవారం ప్రపంచపు మొట్టమొదటి డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించింది.