మరో 9మంది జడ్జిలపై సస్పెన్షన్ వేటు!
హైదరాబాద్ : మరో తొమ్మిదిమంది న్యాయమూర్తులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సస్పెండ్ అయిన వారిలో తిరుపతి, రాధాకృష్ణ, రమాకాంత్ ఉన్నారు.
ఇప్పటికే తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్రెడ్డి, వి.వరప్రసాద్లపై న్యాయస్థానం సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా మరో తొమ్మిదిమంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అలాగే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ మురళీధర్పైనా సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ 11మంది న్యాయమూర్తులు సస్పెండ్ అయ్యారు. అయితే న్యాయమూర్తుల సస్పెన్షన్ పై ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ 120 మంది న్యాయాధికారులు ఆదివారం హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించి గవర్నర్కు వినతిపత్రం సమర్పించింది. ఆ మరుసటి రోజే వారిపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. మరోవైపు హైకోర్టు నిర్ణయంతో తెలంగాణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాగా సస్పెండ్ అయిన న్యాయమూర్తులు వివరాలు:
1. రవీందర్ రెడ్డి
2.వర ప్రసాద్
3.మురళీధర్
4.శ్రీనివాస్ రెడ్డి
5.చంద్రశేఖర్ ప్రసాద్
6.రాధాకృష్ణ చౌహాన్
7.తిరుపతి
8.రమాకాంత్
9.సరిత
10.వేణు
11.రాజు