‘నీరాంచల్’పై రెండు రోజుల వర్క్‌షాప్
సమావేశానికి ఐదు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్రం కొత్తగా అమలు చేస్తున్న ‘నీరాంచల్’ పథకంపై రాష్ట్ర స్థాయిలో అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ హైదరాబాద్‌లో గురు, శుక్రవారాల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వర్క్‌షాపులో పాల్గొంటారని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు.
దేశవ్యాప్తంగా వాటర్షెడ్ల నిర్మాణంలో కొత్త పద్ధతులు అవలంబించేందుకు తొమ్మిది రాష్ట్రాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా నీరాంచల్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. పెలైట్ ప్రాజెక్టుకు ఎంపికైన ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల చొప్పున ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయి. వర్క్ షాపులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ మదాన్ ‘నీరాంచల్’ పథకం లక్ష్యాలను వివరించనున్నారు.