NIT-IIT
-
జేఈఈ మెయిన్స్ ఫలితాలపై ఉత్కంఠ: ర్యాంకెంత? సీటెక్కడ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పూర్తయింది. ఇందులో అర్హత సాధిస్తే అడ్వాన్స్‌కు వెళ్తారు. అందులో లభించే ర్యాంకు ఆధారంగానే ఐఐటీ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే... జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్ మొదలవుతుంది. జేఈఈ మెయిన్స్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? జేఈఈ అడ్వాన్స్‌కు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే... జేఈఈ మెయిన్స్‌లో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు. కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు ఈజీయే! ఎన్ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్ డేటా చెబుతోంది. వరంగల్, తాడేపల్లిగూడెంలలో ఇలా.. గత ఐదేళ్ల సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో 75 వేల వరకు, రిజర్వేషన్ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా వీటిల్లో సీటు గ్యారెంటీ అని తెలుస్తోంది. వరంగల్ నిట్ సీఎస్ఈలో బాలురకు 3,089 ర్యాంకు, బాలికలకు 3,971 ర్యాంకు వరకు సీటు వస్తుంటే, అదే ఏపీ నిట్ (తాడేపల్లిగూడెం)లో బాలురకు 14 వేలు, బాలికలకు 28 వేల వరకు సీటు వస్తోంది. ఓబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13 వేల వరకు, ఏపీలో 33 వేల ర్యాంకు వరకు సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకైతే గరిష్టంగా 97,139 వరకు, ఎస్టీలకు 48 వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. మెకానికల్ బ్రాంచి ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17 వేల వరకు, ఏపీలో 75 వేల వరకు ర్యాంకులకు సీట్లొచ్చాయి. వీటిల్లో అయితే 50 వేల వరకు.. తిరుచ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా గరిష్టంగా జేఈఈ ర్యాంకు 50 వేల వరకు వచ్చినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. జేఈఈ మెయిన్స్ ద్వారా 34,319 సీట్లు భర్తీ దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలి జేఈఈ మెయిన్స్ ర్యాంకులు, నిట్‌లలో సీట్లపై విద్యార్థుల్లో అవగాహన తక్కువ. 10 వేలు దాటి ర్యాంకు వస్తే నీరసపడి పోతున్నారు. కానీ ఏ కాలేజీ అయినా సరే, ఏ బ్రాంచీ అయినా ఫర్వాలేదు అనుకుంటే, ఓపెన్ కేటగిరీలో 40 వేల వరకు, రిజర్వేషన్ అభ్యర్థులకు 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉందని గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను అధ్యయనం చేస్తే తెలు స్తుంది. అందువల్ల తొందరపడి ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవద్దు. – ఎంఎన్ రావు(గణిత శాస్త్ర నిపుణులు) -
కాగితం ముక్క కూడా అనుమతించం!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల మార్పు చేసిన ప్రశ్నపత్రాలతో మొదటిసారిగా ఈ పరీక్షలను నిర్వహించబోతోంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పర్సు, పెన్ను, పెన్సిళ్లే కాదు.. కనీసం కాగితం ముక్క కూడా వెంట తీసుకురావద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, జామెట్రీ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలేవీ వెంట తీసుకురావద్దని వెల్లడించింది.విద్యార్థులకు కావాల్సిన పెన్ను/పెన్సిల్, రఫ్ పేపరు పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయంకంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, రిపోర్టింగ్ సమయం తరువాత గేట్ మూసివేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికోసం తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థుల హాల్టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఫొటో కలిగిన ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ తదితర) ఏదేని ఒక ఒరిజినల్ ఐడీ కార్డును, హాల్‌టికెట్‌ను తెచ్చుకోవాలి. అరగంట ముందే చేరుకోవాలి సోమవారం నుంచి 11వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహించనుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్‌లుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఉంటుం ది. మొదటి షిఫ్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గం టలలోపే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా రు.ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 31వ తేదీలోగా వెల్లడించనుంది. 75 ప్రశ్నలు.. 300 మార్కులు ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు 90 ప్రశ్నలు ఇచ్చేది. అవన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే. వాటికి నెగటివ్ మార్కుల విధానం ఉంది. ఇప్పుడు మాత్రం 75 ప్రశ్నలతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించబోతోంది. గణితంలో 25, ఫిజిక్స్‌లో 25, కెమిస్ట్రీలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ మూడు సబ్జెక్టుల్లో 20 చొప్పున ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ విధానంలో, 5 చొప్పున ప్రశ్నలను న్యూమరికల్ వ్యాల్యూ జవాబు వచ్చే ప్రశ్నలు ఇవ్వనుంది. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు మాత్రం నెగటివ్ మార్కుల విధానం ఉండదు. అయితే ఈసారి విద్యార్థుల స్కోరింగ్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు కీలకం కానున్నాయి. -
ఏప్రిల్ 9 నుంచి ఆన్లైన్లో జేఈఈ-మెయిన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష జేఈఈ-మెయిన్ పరీక్షను ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పరీక్ష నిర్వాహక సంస్థ సీబీఎస్ఈ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆఫ్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సీబీఎస్ఈ.. తాజాగా ఆన్లైన్ తేదీలను కూడా ప్రకటించింది. ఈనెల 15 నుంచి డిసెంబర్ 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. వివరాలను తన వెబ్సైట్లో పొందుపరిచింది. బీఈ, బీటెక్ కోర్సులకు జేఈఈ-మెయిన్ పేపర్ 1 రాయాలని, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సులకు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాయదలుచుకుంటే పరీక్ష ఫీజుగా పేపర్-1 లేదా పేపర్-2లకు జనరల్, ఓబీసీ అభ్యర్థులు బాలురు రూ. 1,000, బాలికలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ బాలురు రూ. 500, బాలికలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు బాలురు రూ. 1,800, బాలికలు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు బాలురు రూ. 900, బాలికలు 900 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షకు హాజరుకాగోరు అభ్యర్థులు జనరల్, ఓబీసీ అయితే బాలురు రూ. 600, బాలికలు రూ. 300, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ బాలురు రూ. 300, బాలికలు రూ. 300 చెల్లించాలి. ఆన్లైన్లో హాజరయ్యేవారికి రెండు పేపర్లు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ బాలురు రూ. 1,400, బాలికలు రూ. 700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ బాలురు రూ. 700, బాలికలు రూ. 700 చెల్లించాలి. కాగా, పరీక్ష రాసే అభ్యర్థులు జనరల్ కేటగిరీ అయితే అక్టోబర్ 01, 1989న, ఆ తరువాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే అక్టోబర్ 1, 1984న, ఆ తరువాత జన్మించి ఉండాలి. జేఈఈ-మెయిన్ రాసేందుకు 2012, 2013లో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు, 2014 పరీక్షలకు హాజరవబోతున్నవారు మాత్రమే అర్హులు. జేఈఈ-మెయిన్ పరీక్షను రాసేందుకు 3 సార్లు మాత్రమే అనుమతిస్తారు.