‘ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోండి’
సాక్షి, ముంబై: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎన్నికలకు ముందే నిర్ధారించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ గద్రే పిలుపునిచ్చారు. అనేక సందర్భాలలో గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళితే అక్కడ జాబితాలో పేరు లేకపోవడంతో ఓటు వేయకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుజాగ్రత్తగా నిర్ధారించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ అవకాశం కల్పించింది.
అందుకు ceo.maharashtra.gov.in అనే వెబ్సైట్ను ఆశ్రయించాలని కోరారు. లేదా జిల్లాధికారి, తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ పేరు ఉందో.. లేదో.. నిర్ధారించుకోవాలని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా పరిశీలనలో దాదాపు 50 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో జాబితాల పునఃపరిశీలన పనులు చేపట్టామని నితిన్ గద్రే తెలిపారు. ఇందులో అనేక నకిలీ ఓటర్ల పేర్లను తొలగించారు. సాంకేతిక కారణాలవల్ల కొన్ని అసలు ఓటర్ల పేర్లు కూడా గల్లంతయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఎన్నికలకు ముందే జాబితాలో పేరు ఉందా.. లేదా అనేది నిర్ధారించుకోవాలని సూచించారు.