ట్యాక్సీ డ్రైవర్‌తో గుంజీలు.. వైరల్ వీడియో
సాక్షి, ముంబై: టాక్సీ డ్రైవర్లు కచ్చితంగా వారి బ్యాడ్జీ ధరించాలని పోలీసులు, అధికారులు సూచిస్తుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ అనధికారికంగా డ్రైవింగ్ చేసినందుకు మూల్యం చెల్లించుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన నేత ఆ ట్యాక్సీ డ్రైవర్ యూనిఫాం ధరించలేదని, కనీసం అతడికి డ్రైవింగ్ బ్యాడ్జీ లేదని అతడితో గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నేత నితిన్ నంద్‌గోకర్ స్పందించారు.
ముంబై ఎయిర్‌పోర్టులో ఓ డ్రైవర్‌ను గమనించాను. అతడి వద్ద డ్రైవింగ్‌కు సంబంధించిన బ్యాడ్జీలేదు. అతడు డ్రైవింగ్ యూనిఫాం కూడా ధరించకుండా కనిపించాడు. సక్రమంగా బ్యాడ్జీ నెంబర్ తీసుకోవాలని, యూనిఫాం ధరించి డ్రైవింగ్ చేసుకోవాలని సూచించిన తర్వాత అతడు చేసిన తప్పును గుర్తించాలని డ్రైవర్‌తో గుంజీలు తీయించినట్లు వెల్లడించారు. మరోసారి ఇలా బ్యాడ్జీ, యూనిఫాం లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించినట్లు తెలిపారు. డ్రైవర్‌తో గుంజలీ తీయించిన వీడియో నంద్‌గోకర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ట్యాక్సీ డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడంటూ నెటిజన్లు కొందరు కామెంట్ చేయగా, ఎంఎన్ఎస్ నేత తీరును మరికొందరు తప్పుపడుతున్నారు.