కుండపోత
సాక్షి, సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో నగరంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి ఎక్కడికక్కడ ట్రాఫిక్స్తంభించింది. రాత్రి 8.30 గంటల వరకు 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
బంజారాహిల్స్, అబిడ్స్, కోఠి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, అచ్చయ్యనగర్, బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రాంనగర్ నాలా పరీవాహక ప్రాంతమైన నాగమయ్య కుంట, అచ్చయ్యనగర్లలో నడుము లోతున వర్షపు నీరు ప్రవహించి, ఇళ్లలోకి చేరింది.
ఇళ్లలోని బియ్యం, పుస్తకాలు, నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. నాగమయ్యకుంట వాసులు హిందీ మహా విద్యాలయలో తెల్లవార్లూ జాగరణ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాంతానికి రాకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మెహిదీపట్నం డివిజన్లోని గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్, టోలిచౌక్, నదీంకాలనీ, లంగర్హౌజ్లలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది బస్తీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తెల్లవార్లూ నిద్ర లేకుండా గడిపారు.
అంధకారం..
వర్ష విలయానికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగెలు తెగిపడి కాలనీలు, బస్తీల్లో అంధకారం అలముకుంది. భారీ వర్షం కారణంగా సీపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో శివారు ప్రాంతాలు తెల్లవార్లూ అంధకారంలో మునిగాయి. రామాంతపూర్, ఉప్పల్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో విద్యుత్ తీగెలపై చెట్లు విరిగిపడడంతో అంధకారం అలుముకుంది. వర్షంతో వినాయక మంటపాల వద్ద అలంకరణ చేసే వారూ అవస్థలు పడ్డారు.
ట్రాఫిక్ జంఝాటం..
భారీ వర్షంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, తార్నాక, బేగంపేట్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాలి లోతున వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులు రాత్రి బాగా పొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది.