ఆసక్తి రేకెత్తిస్తున్న టిక్..టిక్..టిక్
తమిళసినిమా: టిక్ టిక్ టిక్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర వర్గాలు సోమవారం విడుదల చేశాయి. ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, చిత్రంపై అంచనాలను పెంచేస్తోందంటున్నారు పరిశ్రమ వర్గాలు. జయంరవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టిక్ టిక్ టిక్. ఇదే పేరుతో ఇంతకుముందు నటుడు కమలహాసన్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం.
తాజాగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్లో జయంరవికి జంటగా నటి నివేదాపేతురాజ్ నాయకిగా నటిస్తోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో జయంరవి కొడుకు మాస్టర్ ఆరవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నెమిచంద్ జబక్ పతాకంపై వీ.హింటేశ్జబక్ నిర్మిస్తున్నారు. కాగా జయంరవి, శక్తి సౌందర్‌రాజన్‌ల కాంబినేషన్లో ఇంతకుముందు మిరుదన్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. జోంబీస్ల ఇతివృత్తంగా తెరెక్కిన ఈ సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
కాగా మళ్లీ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న టిక్ టిక్ టిక్ చిత్రం అంతరిక్షంలో గురించి తెలిపే తొలి తమిళ చిత్రంగా నమోదు కానుంది. డీ.ఇమాన్ సంగీత భాణీలను అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో బ్రహ్మాండమైన సెట్లో చిత్రీకరణ జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. జయంరవి అంతరిక్షకుడి గెటప్‌లో తాడు పట్టుకుని ఎగబాకుతున్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సంమ్థింగ్ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది.