విమర్శ ప్రధానాంశంగా ఉండే ప్రక్రియ?
కావ్య ప్రక్రియలు - లక్షణాలు
నవల
క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ఎన్నో సృజనాత్మక వచన సాహితీ ప్రక్రియలు వచ్చాయి. ఆంగ్లం నుంచి పుట్టిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘నవల’. ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఎక్కువ జనాదరణ పొందిన ప్రక్రియ కూడా ఇదే. ఈ ప్రక్రియ మొదటిసారిగా ఇటలీలో ప్రారంభమైంది.
నవల అనే పదం ూౌఠ్ఛి (నోవెల్) అనే ఆంగ్లపదం నుంచి వచ్చింది.
తెలుగులో మొదట నవలను వచన ప్రబంధం అని, నవీన ప్రబంధం అని, గద్య ప్రబంధం అని వ్యవహరించేవారు.
నరహరి గోపాల కృష్ణమచెట్టి నవలను మొదట నవీన ప్రబంధం అన్నారు.
కందుకూరి వీరేశలింగం దీన్ని వచన ప్రబంధంగా పేర్కొన్నారు.
తెలుగులో నవలా ప్రక్రియకు నామకరణం చేసినవారు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి.
నవల - నిర్వచనాలు:
* యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి గద్యరూపంలో వ్యక్తం చేసేదే నవల. - రిచర్డ క్రాస్
* నవాన్ విశేషాన్ లాతి గృహ్ణాతీతి నవల.
- కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి
* సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ, ప్రజల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల. -శ్రీ మొదలి నాగభూషణ శర్మ
ముఖ్యమైన నవలలు:
* తొలి తెలుగు నవల - రంగరాజ చరిత్ర
* నరహరి గోపాలకృష్ణమచెట్టి రాసిన రంగ రాజ చరిత్ర అనే నవలకు సోనాబాయి పరిణయం అనే నామాంతరం ఉంది.
* సమగ్ర నవలా లక్షణాలతో వెలసిన మొదటి నవలగా కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర ప్రసిద్ధికెక్కింది. దీనికి ‘వివేక చంద్రిక’ అనే పేరు కూడా ఉంది.
నవల పేరు- కర్తలు
రాజశేఖర చరిత్ర (1878), సత్యరాజా పూర్వదేశ యాత్రలు - కందుకూరి వీరేశలింగం
గణపతి (తొలి హాస్య నవల) - చిలకమర్తి లక్ష్మీనరసింహం
హిమబిందు - అడవి బాపిరాజు
మాతృమందిరం - వేంకట పార్వతీశ కవులు
మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ
మైదానం, దైవమిచ్చిన భార్య - గుడిపాటి వెంకటాచలం
వేయిపడగలు, ఏకవీర - విశ్వనాథ సత్యనారాయణ
బారిష్టరు పార్వతీశం - మొక్కపాటి నరసింహశాస్త్రి
రక్షాబంధనం, శ్మశాన వాటిక - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
చదువు - కొడవటిగంటి కుటుంబరావు
అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా- త్రిపురనేని గోపీచంద్
చివరకు మిగిలేది? - బుచ్చిబాబు
అల్పజీవి - రాచకొండ విశ్వనాథశాస్త్రి
కీలుబొమ్మలు - జి.వి. కృష్ణారావు
అంపశయ్య - నవీన్
తులసిదళం - యండమూరి వీరేంద్రనాథ్
కాలాతీత వ్యక్తులు - శ్రీదేవి
బలిపీఠం - ముప్పాళ్ల రంగనాయకమ్మ
నాటకం
సాహిత్య ప్రక్రియల్లో అత్యంత శక్తిమంతమైన, విశిష్టమైన ప్రక్రియ ‘నాటకం’. ఇది పాఠ కుల హృదయాలను రంజింపజేయడంలో ఉత్తమమైంది. తెలుగు నాటక రంగానికి మహోజ్వల చరిత్ర ఉంది. నాటకం దృశ్య ప్రక్రియకు చెందింది. ఇది లలిత కళలతో సమాహారకళగా ప్రసిద్ధికెక్కింది. క్రీ.శ. 19వ శతాబ్ది చివరి భాగంలో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన మంజరీ మధుకరీయం (1860)తో ఆధునిక తెలుగు నాటకం ప్రారంభమైంది.
నాటకం - నిర్వచనాలు:
కావ్యేషు నాటకం రమ్యం
- భరతుడు (నాట్యశాస్త్రం)
నాటకాంతం హి సాహిత్యం
- అభినవ గుప్తుడు (అభినవ భారతి)
మంగళాది, మంగళమధ్య, మంగళాంతః నాటకం - భారతీయ లాక్షణికులు
నాటకం- లక్షణాలు:
1. నాంది 2. ప్రస్తావన
3. విష్కంభం 4. అంకవిభజన
5. పంచసంధులు 6. భరతవాక్యం
కథ- కథానిక
ప్రాచీన సంప్రదాయ ప్రక్రియ ‘కథ’ అయితే, ఆధునిక సంప్రదాయ ప్రక్రియ ‘కథానిక’. క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్లం నుంచి దిగుమతి అయిన వచన సాహితీ ప్రక్రియలో కథానిక ఒకటి. కథ, కథానిక పదాలను ప్రస్తుతం పర్యాయపదాలుగా వాడుతున్నారు. కథానిక ప్రస్తావన మొదట అగ్ని పురాణంలో కనిపిస్తుంది. ‘షార్ట స్టోరీ’ అనే పదానికి సమానార్థకంగా కథానిక, చిన్న కథ అనే పదాలు ప్రయోగంలో ఉన్నాయి. 1936లో ప్రతిభ అనే పత్రికలో వ్యాసం రాస్తూ ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి తొలిసారిగా ‘షార్ట స్టోరీ’ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా ‘కథానిక’ పదాన్ని సూచించారు. ఆధునిక తెలుగు కథ 1910లో గురజాడ ‘దిద్దుబాటు’తో ప్రారంభమైంది. మొదట దిద్దుబాటు కథను ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథా రచయితలకు గురజాడ మార్గదర్శకుడు.
కథానిక ప్రధాన లక్షణాలు సంక్షిప్తత, ఏకాగ్రత, సమగ్రత, నిర్భరత.
శీలా వీర్రాజు అభిప్రాయం ప్రకారం ‘కథానికకు శిల్పమే ప్రాణం’.
గల్పిక
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో ‘గల్పిక’ ఒకటి. ఇది పరిమాణంలో కథానిక కంటే చిన్నది. దీంట్లో విమర్శ ప్రధానాంశంగా ఉంటుంది. సంఘటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
* మానవ జీవితంలోని ఒడుదుడుకుల్ని చిత్రించేది కథానిక అయితే ఒక వ్యక్తిని గానీ, ఒక వ్యవస్థను గానీ అవహేళన చేసేదే గల్పిక.
* గల్పికలో అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు, భావ దృష్టికి రచయితలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
* ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశగానీ, ఒక సంస్థ పరిణామక్రమంలోని ఒక విశేషంగానీ గల్పికలో ప్రధాన వస్తువు.
* వ్యక్తిని గానీ, వ్యవస్థనుగానీ విమర్శించడం గల్పికలో సర్వసాధారణం.
* 1940 ప్రాంతంలో త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి కుటుంబరావు గల్పికలు రాసి ప్రసిద్ధి చెందారు.
* తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడు కొడవటిగంటి కుటుంబరావు. ఆయన రాసిన గల్పికలు యువ పత్రికలో ప్రచురితమయ్యాయి.