ఆ ఇఫ్తార్ విందులో సామాన్యులు ఏరీ?
ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో.. సామాన్యులకు ఎక్కడా చోటు దొరకలేదు. మొత్తం అదంతా వీఐపీల వ్యవహారంలాగే సాగిపోయింది. ఎక్కడ చూసినా అంతా హై ప్రొఫైల్ రాజకీయ నాయకులే ఉన్నారు. సాధారణ 'వీఐపీ ఇఫ్తార్'ల కంటే ఇది విభిన్నంగా ఉంటుందని కేజ్రీవాల్ చెప్పినా.. వాస్తవానికి మాత్రం అక్కడ చేతులు కలుపుకొన్నది, అలయ్ బలయ్ ఇచ్చుకున్నది అంతా రాజకీయ నాయకులే.
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ లాంటి పెద్దలు కూడా హాజరవ్వడంతో కేజ్రీవాల్ చాలా సంతోషంగా కనిపించారు. వాస్తవానికి వీళ్లిద్దరితో కేజ్రీవాల్‌కు గత కొంత కాలంగా తీవ్ర విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ ఇఫ్తార్ విందుకు సామాన్యులు ఎవరికీ ఎంట్రీ లేదు. కేవలం 3వేల మంది ఆహ్వానితులను మాత్రమే లోనికి రానిచ్చారు. అయినా.. ఇక్కడకు వచ్చిన సామాన్యులను చూసి ఇతర రాజకీయ నాయకులు కూడా సంతోషించారని కేజ్రీవాల్ చెప్పారు! బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), టీఎంసీ.. ఇలా అన్ని పార్టీల వాళ్లనూ తాము పిలిచామని ఆయన అన్నారు.