కోతలరాయుడు చంద్రబాబు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి
నున్న(విజయవాడ రూరల్) :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ కోతలరాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.పార్థసారథి ఎద్దేవా చేశారు. శుక్రవారం నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాదు వెళ్తే అరెస్టు చేస్తారనే భయంతో రాష్ట్రాని తాకట్టుబెట్టిన ఘనత బాబుదేనన్నారు. 12 రోజుల పాటు పుష్కరాల్లో నదిహారతి అంటూ రైతుల సమస్యలను పట్టించుకోని దొంగ ప్రభుత్వమని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై లేనిపోని నిందలు వేయడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతకాని దద్దమ్మగా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంటలు పూర్తిగా ఎండిపోయిన విషయం తెలియదని అధికారులపై మండిపడడం మంత్రి చేతకాని తనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 469 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ పథకం కింద బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు వైద్యసేవలందటం లేదని చెప్పారు. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన కోసం జగన్మోహన్రెడ్డికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.