ఊరికి కరెంట్ కట్
సాక్షి, కొండాపూర్(మెదక్) : కరెంట్ బిల్లులు చెల్లించలేదని ఆ శాఖ అధికారులు గ్రామానికి మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతేకాకుండా ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌ను సైతం కట్ చేశారు. దీంతో తాగునీటి కోసం గ్రామస్తుల ఇబ్బందులు వర్ణాణాతీం. ఇది కొండాపూర్ మండల పరిధిలోని నూతన పంచాయతీగా ఏర్పడిన శివ్వన్నగూడెం గ్రామ ప్రజల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని శివ్వన్నగూడెం గ్రామ పంచాయతీలో విద్యుత్ బిల్లులను ప్రతీ నెల 17వ తేదీన వచ్చి వసూళ్లు చేసేవారు.
అయితే గ్రామంలో ఎటువంటి చాటింపు లేకుండా, ప్రజలకు సమాచారం అందించకుండా ఆదివారం ఉదయం 11 గంటలకు అధికారులు గ్రామానికి వచ్చారు. అసలే వర్షాకాలం కావడంతో రైతులంతా తమ పొలాల్లో విత్తనాలు నాటేందుకు వెళ్లారు. గ్రామంలో ఎంత తిరిగినా ఎవరూ లేకపోవడంతో బిల్ కలెక్షన్ ఏమీ రాలేదు. దీంతో ఆగ్రహించిన విద్యుత్ అధికారులు ఆ గ్రామానికి మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్వయంగా గ్రామ సర్పంచ్ చెప్పినా అధికారులు వినలేదు సరి కదా ఏకంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ బోర్ల వద్ద కూడా కనెక్షన్లను తొలగించారు.
దీంతో ఆదివారం నుండి తాగేందుకు నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, నీళ్లు లేనిది ఎలా ఉండాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బిల్లులు కట్టని వాళ్ల కనెక్షన్ తొలగించాలి కానీ కట్టిన వారి కనెక్షన్ తొలగించడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ ఏడీఏ రాజమల్లేశంను వివరణ కోరగా వ్యవసాయ బోర్ల విద్యుత్‌ను కట్ చేయలేదని, ఎన్నిసార్లు బిల్ కలెక్షన్‌కు వెళ్లినా అధికారులను తిట్టి పంపిస్తున్నారని, అందుకే సరఫరా నిలిపివేశామని తెలిపారు. మళ్లీ ప్రతి నెల సక్రమంగా బిల్లులు చెల్లిస్తామంటూ సర్పంచ్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని వివరణ ఇచ్చారు.