రైల్వే బడ్జెట్ విలీనం మంచిదికాదు
ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేస్తూ కేంద్రకేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నాటి రైల్వే మంత్రి, నేటి బిహార్ సీఎం నితీష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. 92 ఏళ్ల ఆనవాయితీకి చరమగీతం పాడుతూ సాధారణ బడ్జెట్లో ఈ బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల దేశానికి ఎలాంటి మంచి చేకూరదని ఆయన విమర్శించారు. దీనివల్ల రైల్వే తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందని తెలిపారు. ఈ విషయంపై ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. 1924 నుంచి ప్రత్యేక బడ్జెట్‌గా కొనసాగుతూ వస్తున్న రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
రైల్వే మంత్రిగా తనకున్న అనుభవం ప్రకారం రైల్వే బడ్జెట్‌కు మంగళం పాడటంతో ఇటు రైల్వేకు, అటు దేశానికి ఎలాంటి మంచి చేకూరదని వివరించారు. దీనివల్ల రైల్వే ఇప్పటివరకు కలిగిఉన్న తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని నితీష్ పేర్కొన్నారు. అటల్ బిహార్ వాజ్‌పేయి కాలంలో ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్, రైల్వే మంత్రిగా పనిచేశారు. రైల్వే నుంచి ప్రజలు చాలా ఆశిస్తుంటారని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, రైల్వే శాఖను సాఫీగా నడిచేలా చేయడానికి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ఉండటమే మంచిదని సూచించారు.
ప్రభుత్వం ముందస్తు లాగానే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను కొనసాగించాలని చెప్పారు. తను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, చాలామంది మంత్రులు సాధారణ బడ్జెట్ కంటే రైల్వే బడ్జెట్‌పైనే ఎక్కువగా ఆసక్తిచూపేవారని గుర్తుచేసుకున్నారు. వారి రాష్ట్రాలకు, నియోజకవర్గాలకు కొత్త రైళ్లు మార్గాలు వస్తాయని ఆశించేవారని చెప్పారు. కొన్ని సార్లు రైల్వేమంత్రులు సమస్యలు ఎదుర్కొన్నా, రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండటమే మంచిదని నితీష్ సూచించారు.