వంచనకు ‘వంద
సాక్షి ప్రతినిధి, గుంటూరు
షరా మామూలే! తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. అటు ప్రజలకు, ఇటు పార్టీ కేడర్‌కు నిరాశ కలిగిం చింది. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త మాట చెబుతూ ఇంకా ప్రజలను నమ్మించే యత్నంలోనే ఉన్నారు.
‘ఇదే చివరి ఎన్నిక...ఇప్పుడు అధికారంలోకి రాకపోతే పార్టీయే ఉండద’ని కేడర్‌ను రెచ్చగొట్టి సీఎం అయిన తరువాత వారికి ఉప యోగపడే నిర్ణయం ఒక్కటీ తీసుకోలేదు. ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా పనులు కావడం లేదనే బాధను ఆ పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది.
ఈ ఏడాది జూన్ ఎనిమిదవ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ఐదు సంతకాల్లో ఒక్క దానిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.
రుణమాఫీ ప్రకటన కారణంగా రైతులు రెండు విధాలుగా నష్టపో యారు. జిల్లాలో 11 లక్షల 78 వేల మంది రైతులు వివిధ వాణిజ్య బ్యాంకుల్లో రూ.8,598 కోట్లను పంట, బంగారు రుణాలను తీసుకున్నారు. ఎన్నికల సమయంలో షరతులు లేకుండా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని చెబుతూ అందులోనూ అనేక నిబంధనలు విధిస్తుండటంతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో రూ.1400 కోట్లను రుణాలుగా తీసుకున్న 71,418 గ్రూపులు ఆ పార్టీ గెలుపు కోసం ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రయత్నించాయి. ఆ తరువాత మహిళల రుణాలపై స్పష్టమైన ఉత్తర్వులు రాకపోవడంతో సభ్యులు నిత్యం ఏదో గ్రామంలో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తూనే ఉన్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన తొలి హామీ ‘ఇంటికో ఉద్యోగం’ను నిలబెట్టుకోలేకపోయారనే అభిప్రాయం వెలువడుతోంది.
టీడీపీ ప్రభుత్వం తరచూ మాట మారుస్తున్న వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన బాబు విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. ఆ తరువాత విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఉంటుందని వెల్లడించారు.
జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారాన్ని యువకుల్లోకి తీసుకు వెళ్లిన టీడీపీ నేతలకు తాజా పరిస్థితి మింగుడు పడటం లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న 800 మందిని కొత్త ప్రభుత్వం తొలగించింది.
పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ ఆ నిధులను బాబు కొత్త పథకాలకు మళ్లిస్తూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
తాము ప్రతిపక్షంలో ఉన్నామో అధికారంలోకి వచ్చామో అర్థం కావడం లేదని టీడీపీ కేడర్ సైతం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పని కూడా కావడం లేదని, బాబు గెలుపు కోసం ఇల్లు గుల్ల చేసుకున్నామనే ఆవేదన పార్టీ కేడర్ నుంచి వినపడుతోంది.
ఇంత వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభించ లేదు. దేవాదాయశాఖకు చెందిన కమిటీల రద్దుపై కోర్టు స్టే ఇవ్వడం తో, మిగిలిన కమిటీలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందనే భయం వారిని వెన్నాడుతోంది.
ఇక వృద్ధ్యాప్య, వితంతు,వికలాంగ పింఛన్ల పెంపు అమలులోకి రాకపోవడంతో పేద వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి.