హీరోయిన్ లేకుండానే సినిమా!
సాధారణంగా సినిమా అంటే.. హీరోయిన్లు వర్షంలో తడుస్తూ సాగే పాట ఒకటి, నాలుగైదు రొమాంటిక్ సన్నివేశాలు, ఇంకా వీలైతే లిప్‌లాక్‌లు. ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు హీరోయినే లేకుండా సినిమా తీయడం సాధ్యమేనా అంటే.. తాము చేసి చూపిస్తామంటున్నారు బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్, నిర్మాత దినేష్ విజన్. వీళ్లిద్దరు కలిసి తీస్తున్న 'బద్లాపూర్-2' సినిమాలో అసలు హీరోయిన్ పాత్రే ఉండబోదట. ఈ విషయాన్ని నిర్మాత విజన్ స్పష్టం చేశారు. తమ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఒక సినిమా స్క్ర్రిప్టు రాయడానికి రెండేళ్ల సమయం తీసుకుంటారని, బద్లాపూర్ సినిమాకు కూడా అలాగే తీసుకున్నారని చెప్పారు. ఈమధ్యే బద్లాపూర్-2 సినిమా స్క్రిప్టు పని పూర్తయిందని తెలిపారు.
తొలుత ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్గా చేస్తుందని రూమర్లు వచ్చినా, వాటిని ఆయన కొట్టిపారేశారు. రాబ్తా సినిమా విడుదల కాగానే తాము బద్లాపూర్-2లో నటీనటుల ఎంపికను పూర్తి చేస్తామన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని మాత్రమే ప్రస్తుతానికి చెప్పగలమన్నారు. విజన్ నిర్మాతగా వ్యవహరించిన రాబ్తా సినిమా ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తమ మగధీర సినిమానే కొద్దిగా మార్చి అక్కడ రాబ్తాగా తీస్తున్నారంటూ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కోర్టుకెక్కారు. అయితే పునర్జన్మ అనేది బాగా విజయవంతమైన కాన్సెప్ట్ అని, ఇంతకుముందు హిందీలో కరణ్ అర్జున్, మధుమతి, ఓం శాంతి ఓం ఈ కాన్సెప్టుతోనే వచ్చాయని విజన్ అన్నారు. తాను రాజమౌళికి, ఆయన సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని, ఆయనను తానెప్పుడూ కాపీ చేయబోనని చెప్పారు. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ కేవలం పునర్జన్మేనని, వాళ్లకు తన సినిమా చూపించి, మగధీరలో ఒక్క సీన్ కూడా కాపీ చేయలేదని నిరూపిస్తానన్నారు. రాబ్తా సినిమా జూన్ 9న విడుదల కావాల్సి ఉంది.