సేవలుశూన్యం!
ప్రజలను పట్టిపీడిస్తున్న హెచ్ఐవీ, ఎయిడ్స్ మహమ్మారిని సమాజం నుంచి పారద్రోలేందుకు కేంద్ర ప్రభుత్వం 1992లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని స్థాపించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో రోగనివారణకు చర్యలు చేపట్టింది. 2002 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఇందుకు అవసరమైన వసతి, సిబ్బంది, మందులు ఇతరత్రా వాటిని సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించింది. ఐసీటీసీ, పీపీటీసీటీ కేంద్రాలను రాష్ట్రంలోని జిల్లా హెడ్ క్వార్టర్లలోని ఆస్పత్రులతో పాటు ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, అప్‌గ్రేడెడ్ పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసి ఉచిత వైద్యసేవలతో పాటు రోగులకు అవసరమైన మనో ధైర్యాన్ని కల్పించేవారు. అయితే పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యధోరణితో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వీర్యమైపోయే స్థితికి చేరుకుంది.
రాజాం:
ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా ఏపీ శాక్ను తీసుకెళ్లి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో విలీనం చేసినప్పటికీ నుంచి ఈ శాఖకు కష్టాలు మొదలయ్యాయి. ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ల్యాబ్‌లో ముందుగా భద్రతా సూచనలు పాటిం చాల్సి ఉన్నప్పటికీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉపయోగించాల్సిన హేండ్ గ్లౌస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భయంతో వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని టెక్నీషియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సిరంజీలు, కాటన్, స్పిరిట్ వంటి నిరంతరం వినియోగించే వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది. మందుల్లో సైతం కోత విధించారు.
సిబ్బంది వెతలు
ఇదిలా ఉండగా సిబ్బంది వెతలు పెరిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 19 మంది ల్యాబ్టెక్నీషియన్లు, 25 మంది కౌన్సెలింగ్ సిబ్బంది, స్టాఫ్‌నర్సులు ఐదుగురు, ఫార్మాసిస్టులు ముగ్గురు, సహాయక సిబ్బంది నలుగురు ఉన్నారు. గడిచిన రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదు. రెండేళ్లుగా ఇంక్రిమెంట్లు, ఎరియర్స్, వేతనాల పెంపుదల తదితర వాటిపై పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
జరగని నియామకాలు
రోగుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నప్పటికీ అందుకుతగ్గట్టుగా వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నియామకం జరగలేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. దీనికితోడు కొన్ని ఆస్పత్రుల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పనిభారం మోపుతుండడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సిబ్బందితో పాటు, రోగులు కోరుతున్నారు.
అభద్రతతో పరీక్షలు చేస్తున్నాం
ఈ వృత్తిలో ప్రమాదం ఉందని తెలిసినా సమాజసేవే లక్ష్యంగా గౌరవ వేతనం పొందుతూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. నిత్యం వినియోగించే హేండ్ గ్లౌస్, కాటన్, స్పిరిట్ తదితర వస్తువులను ఈ ప్రభుత్వం సరఫరా చేయడం మానేసింది. దీంతో అభద్రతా భావంతో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది.
- ఎన్.భాస్కరరావు,
ల్యాబ్ టెక్నీషియన్, ఐసీటీసీ కేంద్రం, రాజాం
నిధుల ు కొరతతో ఇబ్బందులు
ఐసీటీసీ, పీపీటీసీటీ కేంద్రాల నిర్వహణకు అవసరమైన కంటెంజెన్సీ నిధుల కొరత వేధిస్తోంది.. జిల్లాలో 8,256 మంది హెచ్వీ రోగులు నమోదయ్యారు. వీరిలో 5,346 మంది మాత్రమే మందులు వినియోగిస్తున్నారు. మిగిలిన వారిని చైతన్యపర్చడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో పూర్తిస్థాయి వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతున్నాం.
- కె.శ్రీరామ్‌శర్మ, ఐసీటీసీ కౌన్సెలర్, రాజాం.