పలు ప్రభుత్వాసుపత్రులలో వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతుంటే పోలవరంలోని ప్రభుత్వ వైద్యశాల (సామాజిక ఆరోగ్య కేంద్రం) పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
పోలవరం, న్యూస్‌లైన్ : పలు ప్రభుత్వాసుపత్రులలో వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతుంటే పోలవరంలోని ప్రభుత్వ వైద్యశాల (సామాజిక ఆరోగ్య కేంద్రం) పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ వసతులు పూరిస్థాయిలో ఉన్నా వైద్య సిబ్బంది కొరతతో వైద్యం అందక రోగులు వెనుదిరగాల్సి వస్తోంది. నాలుగు పీహెచ్‌సీలకు, 70 గిరిజన, గిరిజనేతర గ్రామాల ప్రజలకు ప్రధాన వైద్యశాల కావడంతో పోలవరంలోని సీహెచ్‌సీకి పూర్తిస్థాయిలో వసతులు కల్పించారు. గతేడాది రూ. 20 లక్షలతో అన్ని వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య రెగ్యులర్ వైద్యులు లేకపోవడం.
దీంతో ఇతర పీహెచ్‌సీల నుంచి వైద్యులను రప్పించి ఓపీ నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మాతా శిశు సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకంగా సీమాంక్ సెంటర్ కూడా ఉంది. కానీ గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేందుకు టెక్నిషియన్ లేరు. ఎక్స్‌రే విభాగంలో రేడియో గ్రాఫర్ కూడా లేకపోవడంతో ఈ పరికరాలు అక్కరకు రావడం లేదు. దీంతో ఆ వైద్య పరీక్షల కోసం కొవ్వూరు, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెగ్యులర్ వైద్యాధికారులను నియమించడంతోపాటు రేడియోగ్రాఫర్‌ను, అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెక్నీషియన్‌ను నియమించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.