ఎన్నికల చర్చా వేదికగా ఏఐసీసీ సమావేశాలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం. ఒకప్పుడు కంచుకోటైన ఆంధ్రప్రదేశ్‌లో దిక్కు తోచని దుస్థితి. ఎప్పట్లాగే రిక్త హస్తం చూపేలా కన్పిస్తున్న ఉత్తరాది. తెగదెంపులకు సిద్ధమవుతున్న యూపీఏ మిత్రులు. మరోవైపు ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు. రాహుల్ గాంధీని ప్రచార సారథిగా, ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంపై అంతులేని ఊగిసలాట. ఇంతటి సంక్షోభ సమయంలో కింకర్తవ్యం ఏమిటన్న దానిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మథనం జరపనుంది. ఢిల్లీలోని తోల్కతొరా మైదానంలో శుక్రవారం జరగబోయే ఏఐసీసీ సమావేశం ఇందుకు వేదిక కానుంది.
అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ వంటి కాంగ్రెస్ అతిరథ మహారథులతో పాటు దేశవ్యాప్తంగా 3,000 మంది నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. యూపీఏ సర్కారుకు తలబొప్పి కట్టిస్తున్న అవినీతి, ధరల పెరుగుదల తదితరాలతో పాటు ప్రజలకు చేరువయ్యే మార్గాంతరాలపై మల్లగుల్లాలు పడే అవకాశం కన్పిస్తోంది. ఎప్పట్లాగే భేటీలో ఆద్యంతం రాహుల్ నామస్మరణ జరుగుతుందంటున్నారు.
జైపూర్ సదస్సు మాదిరిగానే ఈ సమావేశంలోనూ రాహుల్‌నే హైలైట్ చేయనున్నారు. ఆమేరకు ఆయన ప్రసంగ పాఠం కూడా సిద్ధమైందని సమాచారం.
ఏఐసీసీ భేటీకి దేశవ్యాప్తంగా 3,000 మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపగా ఆంధ్రప్రదేశ్ నుంచి 108 మందికి మాత్రమే చోటు దక్కింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు జరగకపోవడంతో 2007లో ఏఐసీసీ సభ్యులుగా ఎన్నికైన జాబితానే ప్రామాణికంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రులు మినహా ఇతర కో ఆప్షన్ సభ్యులకు మాత్రం ఈసారి పాసులు నిరాకరించారు.
సీమాంధ్ర ఎంపీల డ్రామా!
సీమాంధ్రకు చెందిన ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్లకు ఆహ్వానం అందలేదంటూ గురువారమంతా జోరుగా ప్రచారం జరిగింది.
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినందుకే ఆహ్వానం పంపలేదని ఆరోపిస్తున్నారు. అయినా ఏఐసీసీ భేటీకి వెళ్లి సమైక్యాంధ్ర గళాన్ని విన్పిస్తామని వారన్నారు.
అయితే ఎంపీలకు ఎస్మెమ్మెస్‌తో పాటు పోస్టు ద్వారా సమాచారం పంపామని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.