ఏపీలో నో వేకెన్సీ!
* ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేదు.. ఇది ఏపీపీఎస్సీ లెక్క
* ఖాళీ పోస్టుల సమాచారం పంపని చంద్రబాబు ప్రభుత్వం
* ఒక్క నోటిఫికేషన్ కూడా వద్దని పరోక్షంగా ఆదేశాలు
* 1.42లక్షల ఖాళీపోస్టులున్నాయన్న కమల్‌నాథన్ కమిటీ
* ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీగా లేదు..’ వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చెబుతున్నమాట.
సర్వీస్ కమిషన్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అదేంటి.. ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకపోవడమేమిటి.. అని ఆశ్చర్యపోతున్నారా? రాష్ర్ట ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఇస్తే ఆ వివరాల ప్రకారం ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఆయా పోస్టులను భర్తీ చేస్తుంది. ఆ పరీక్షల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.
నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాలని కూడా ఏపీపీఎస్సీని కోరకపోతే ఆ సంస్థ మాత్రం ఏం చేస్తుంది? అందుకే ఎప్పుడు సమావేశం జరిగినా... అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలూ రానందున ఉద్యోగ ఖాళీలేవీ లేవని ఏపీపీఎస్సీ తన నివేదికలలో రాసుకుంటోంది.
తాము చెప్పేవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయవద్దని అధికారంలోకి వచ్చిన తొలిరోజే తెలుగుదేశం ప్రభుత్వం ఏపీపీఎస్సీకి స్పష్టం చేసిందని అధికారవర్గాల సమాచారం. నిజానికి చంద్రబాబు విధానమే అది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన బద్ధ వ్యతిరేకి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శుద్ధ దండగమారి వ్యవహారమని ఆయన తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు.
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు...
ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎపుడు విడుదలవుతాయా అని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీకి రాష్ర్ట ప్రభుత్వం కొత్త చైర్మన్‌గా పి.ఉదయభాస్కర్‌ను నియమించడంతో నోటిఫికేషన్లు వెలువడడమే తరువాయి అని నిరుద్యోగులు భావించారు. అయితే వారి ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
ఇప్పటికే వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులను టీడీపీ ప్రభుత్వం తొలగించిం ది. మరింత మందిని తొలగించే ఆలోచనలో ఉంది. అలాంటిది ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి జాబితాలను పంపిస్తుందని భావించడం అత్యాశేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పగ్గాలు చేపట్టి 18 నెలలవుతున్నా ఉద్యోగాల ఖాళీల వివరాలను చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఇంతవరకు పంపించలేదు. అందువల్ల ఏపీపీఎస్సీ లెక్కల్లో మాత్రం రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీ లేనట్లే. ఈ ఏడాది మే 28న ఇన్‌ఛార్జి ఛైర్మన్ నేతృత్వంలో జరిగిన సర్వీస్ కమిషన్ సమావేశపు నివేదికలో అదే విషయాన్ని స్పష్టంగా రాసుకున్నారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ ‘ప్రైవేటు’ సలహా!
రాష్ట్ర విభజనకు ముందు వివిధ ఖాళీల భర్తీకోసం వివిధ శాఖలనుంచి ఏపీపీఎస్సీకి నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం 16వేల పోస్టులకు నోటిఫికేషన్లు సిద్ధమయ్యాయి. అయితే ఆ తరుణంలో ఎన్నికలు రావడంతో అవి నిలిచి పోయాయి. తరువాత ఖాళీల భర్తీకి సంస్థ ముందుకు వెళ్లకుండా ప్రభుత్వం కళ్లెం వేసింది. ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉదయభాస్కర్.. ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫికేషన్లు జారీచేస్తామంటూనే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు రంగంలోనే మంచి అవకాశాలున్నాయని సలహా ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పరీక్షలకోసం అయ్యే ప్రిపరేషన్ ప్రైవేటు ఉద్యోగాలకు పనికివస్తుందని పేర్కొన్నారు. ఈ మాత్రానికి ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను నియమించడమెందుకని, ఆయన్ను నియమించడం గుర్రానికి కాళ్లు కట్టేసి రౌతును ఎక్కించినట్లుగా ఉందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.
నోటిఫికేషన్లకు బదులు ఊస్టింగ్‌లు
జాబు కావాలంటే బాబు రావాలన్నారు. కానీ బాబు వచ్చాక జాబులకు కోత పెడుతున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలే లేవు. కొత్తగా నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు చంద్రబాబు సర్కారు తీరు చూసి ఉసూరుమంటున్నారు. ఇప్పటికే 15వేల మంది ఆదర్శ రైతులను తొలగించారు. 7వేల మంది గృహనిర్మాణ వర్క్ ఇన్స్పెక్టర్లను ఇంటికి పంపించారు.
2వేల మంది ఉపాధి హామీ కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. బాబు అధికారంలోకి వచ్చాక మొత్తంగా 25వేల మందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఏతావాతా ఉద్యోగాల భర్తీపై పెట్టుకున్న ఆశలు మొత్తం నీరుగారిపోతుండడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
త్రిశంకు స్వర్గంలో డీఎస్సీ!
డీఎస్సీ ఫలితాలు వెల్లడై ఐదు నెలలు దాటుతున్నా ప్రభుత్వం మెరిట్ జాబితాను ప్రకటించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు నిరాశా నిస్పృ హల్లో ఉన్నారు. 2014 నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదలైంది. 10,313 పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 3,97,294 మంది పరీక్షకు హాజరయ్యారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచేలోగానే ఫలితాలు ప్రకటించి నియామకాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది.
చివరకు ఫలితాలను జూన్ 3న ప్రకటించారు. ప్రశ్నల్లోని తప్పులపై చాలా మంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కొం దరు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. అసలు టెట్‌ను టీచర్ రిక్రూట్‌మెంటును కలిపి నిర్వహించడం(జీవో38)పైనా కొందరు పిటిషన్లు వేశారు. ట్రిబ్యునల్‌లో ఉన్న కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అవకాశమున్నా ఆ కేసులనే సాకుగా చూపి వాయిదాలు వేసుకుంటూ వెళ్తోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డీఎస్సీలోని కొన్ని కేటగిరీ పోస్టుల భర్తీపై ఇలాగే కోర్టు కేసులు పడ్డాయి.
అయితే ఆ కేసులున్న కేటగిరీలను మినహాయించి తక్కిన పోస్టులన్నిటినీ అప్పటి ప్రభుత్వం భర్తీచేసింది. ప్రస్తుతం 10,313 పోస్టుల్లో 7వేలకు పైగా పోస్టులు ఎస్జీటీ కేటగిరీకి చెందినవే. వీటిపై ఎలాంటి వివాదమూ లేదు. స్కూల్ అసిస్టెంటు తదితర పోస్టులకు కొన్ని న్యాయపరమైన అభ్యంతరాలు ట్రిబ్యునల్‌లో ఉన్నాయి. ట్రిబ్యునల్‌లో అభ్యంతరాలున్నప్పటికీ స్టే ఉత్తర్వులు లేనంతవరకు ప్రభుత్వం నియామకాలకు నిరభ్యంతరంగా ముందుకెళ్లవచ్చు. కానీ ప్రభుత్వం చిన్న కారణాలను సాకుగా చూపి నియామకాలను జాప్యం చేస్తోంది.
రాష్ర్టంలో ఖాళీ పోస్టులు 1.42 లక్షలు
రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు ఉన్నాయని కమలనాథన్ కమిటీ గుర్తించింది. విభజన సమయంలో నాటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వమే తెలంగాణ, ఏపీల్లో ఉన్న వివిధ పోస్టులు, వాటి వివరాలను కమలనాథన్ కమిటీకి అందించింది. ఆ వివరాలు కావాలని ఇప్పటివరకు ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఉలు కూ పలుకూ లేకుండా పోయిందని ఏపీపీఎస్సీ వర్గాలంటున్నాయి.