Noida flat buyers
-
ఫ్లాట్ బాధితుల నోటా బాట..
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : సాధారణంగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటెయ్యాలని నిర్ణయించుకుంటారు.అయితే, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారంతా నోయిడా ఫ్లాట్ కొనుగోలు బాధితులు. నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు వేల మంది సొమ్ము కట్టారు. పదేళ్లయినా ఫ్లాట్లు అప్పగించకపోవడం, ఏ రాజకీయ నాయకుడు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న ‘నోయిడా ఎక్స్టెన్షన్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ మెంబర్స్ అసోసియేషన్ (నెఫోమా) ఆధ్వర్యంలో ‘నో హోం నో వోట్’ ప్రచారం చేపట్టారు. ఈ సంఘంలో 20 నుంచి 25 వేల మంది సభ్యులున్నారు. వీరితో సంబంధాలున్న వారు మరో లక్ష మంది ఉన్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలు గౌతమ్ బుద్ధనగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో కొత్తగా 5 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఫ్లాట్ బాధితులున్నారు. రుద్ర ప్రాజెక్ట్స్‌లో వీళ్లు ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. 2015 నాటికే ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పిన ఆ సంస్థ ఇంత వరకు అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినా తమ కష్టం మాత్రం తీరలేదని నెఫోమా అధ్యక్షుడు అనూఖాన్ ఆరోపించారు. -
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ కు భారీ షాక్ తగిలింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 5 కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని ఆగస్టు 12 వ తేదీలోపుగా చెల్లించాలని యునిటెక్ సీనియర్ మేనేజ్ మెంటును ఆదేశించింది. లేని పక్షంలో జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం హెచ్చరించింది. యూనిటెక్ గ్రూప్, బుర్గుండి సొసైటీలో నోయిడా సెక్టార్ 76 ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోబాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ ( ఎన్సీడీఆర్సీ ) ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాల్సింది ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడం సీరియస్ గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.తక్షణమే పరిహారం చెల్లించాలని ఆగస్టు 12 వరకు గడువిచ్చింది. దీంతోపాటుగా ఈ గడువు లోపు చెల్లించడంలో విఫలమైతే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో మార్కెట్లో షేరు ఢమాల్ అంది. శుక్రవారం నాటి ఇంట్రా డే మార్కెట్ లో సుమారు రెండు శాతం నష్టాలతో ట్రేడవుతోంది. కాగా గుర్గావ్ కు చెందిన సంజయ్ అరోరో 2006 నవంబరులో గ్రేటర్ నోయిడాలోని యూనిటెక్ లిమిటెడ్ ప్రాజెక్టులో బుక్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం 36 నెలల్లో ఫ్లాట్‌ను అప్పగించలేదు సరికదా తనను తీవ్రంగా వేధించిందంటూ సంజయ్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై కమిషన్ విచారణ జరిపింది. యూనిటెక్‌పై అనేక కేసులు కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, 144 మంది ఉమ్మడిగా చేసిన ఫిర్యాదు కూడా విచారణలో ఉందని తెలిపింది. ఇంటిని కొనాలన్న కోరిక పిటిషనర్ సంజయ్ అరోరా జీవితాన్ని నాశనం చేసిందని వ్యాఖ్యానించింది. యూనిటెక్ ఆయనను తీవ్రంగా వేధించిందని పేర్కొంది. ప్రాజెక్టు పనులు జరగని సమయంలో అరోరా చెల్లింపుల్లో ఆలస్యం జరిగినపుడు, ఆ సొమ్ముపై వడ్డీ చెల్లించాలని యూనిటెక్ కోరడం సహేతుకం కాదని తెలిపింది. దాదాపు తొమ్మిదేళ్ళు గడచిన తర్వాత అనేక సమస్యలు ఉన్న మరో ఫ్లాట్‌ను తీసుకోమని చెప్పడం సరికాదని పేర్కొంది. ఫిర్యాదుదారు ఆరోగ్యాన్ని కోల్పోయారని, ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న కమిషన్ సంజయ్ అరోరాకు రూ.59,98,560ను సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు వ్యాజ్య ఖర్చుల కోసం మరో రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశించింది. యూనిటెక్ వద్ద డిపాజిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో యూనిటెక్ షేర్ ధర శుక్రవారం 1.5 శాతం ఇంట్రా డే పడిపోయింది.