ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ కు భారీ షాక్ తగిలింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 5 కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని ఆగస్టు 12 వ తేదీలోపుగా చెల్లించాలని యునిటెక్ సీనియర్ మేనేజ్ మెంటును ఆదేశించింది. లేని పక్షంలో జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం హెచ్చరించింది.
యూనిటెక్ గ్రూప్, బుర్గుండి సొసైటీలో నోయిడా సెక్టార్ 76 ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోబాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ ( ఎన్సీడీఆర్సీ ) ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాల్సింది ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడం సీరియస్ గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.తక్షణమే పరిహారం చెల్లించాలని ఆగస్టు 12 వరకు గడువిచ్చింది. దీంతోపాటుగా ఈ గడువు లోపు చెల్లించడంలో విఫలమైతే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో మార్కెట్లో షేరు ఢమాల్ అంది. శుక్రవారం నాటి ఇంట్రా డే మార్కెట్ లో సుమారు రెండు శాతం నష్టాలతో ట్రేడవుతోంది.
కాగా గుర్‌గావ్ కు చెందిన సంజయ్ అరోరో 2006 నవంబరులో గ్రేటర్ నోయిడాలోని యూనిటెక్ లిమిటెడ్ ప్రాజెక్టులో బుక్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం 36 నెలల్లో ఫ్లాట్‌ను అప్పగించలేదు సరికదా తనను తీవ్రంగా వేధించిందంటూ సంజయ్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ని ఆశ్రయించారు. దీనిపై కమిషన్ విచారణ జరిపింది. యూనిటెక్‌పై అనేక కేసులు కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, 144 మంది ఉమ్మడిగా చేసిన ఫిర్యాదు కూడా విచారణలో ఉందని తెలిపింది. ఇంటిని కొనాలన్న కోరిక పిటిషనర్ సంజయ్ అరోరా జీవితాన్ని నాశనం చేసిందని వ్యాఖ్యానించింది. యూనిటెక్ ఆయనను తీవ్రంగా వేధించిందని పేర్కొంది. ప్రాజెక్టు పనులు జరగని సమయంలో అరోరా చెల్లింపుల్లో ఆలస్యం జరిగినపుడు, ఆ సొమ్ముపై వడ్డీ చెల్లించాలని యూనిటెక్ కోరడం సహేతుకం కాదని తెలిపింది. దాదాపు తొమ్మిదేళ్ళు గడచిన తర్వాత అనేక సమస్యలు ఉన్న మరో ఫ్లాట్‌ను తీసుకోమని చెప్పడం సరికాదని పేర్కొంది. ఫిర్యాదుదారు ఆరోగ్యాన్ని కోల్పోయారని, ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న కమిషన్ సంజయ్ అరోరాకు రూ.59,98,560ను సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు వ్యాజ్య ఖర్చుల కోసం మరో రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశించింది. యూనిటెక్ వద్ద డిపాజిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో యూనిటెక్ షేర్ ధర శుక్రవారం 1.5 శాతం ఇంట్రా డే పడిపోయింది.