Unitech
-
తీహార్ జైలు అధికారుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: యూనిటెక్ మాజీ ప్రమోటర్లు సంజయ్, అజయ్ చంద్రాతో కుమ్మక్కైయ్యారంటూ తీహార్ జైలు అధికారులు కొందరిని సస్పెండ్ చేయమని, వీరిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా అందించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చంద్ర సోదరులు జైలు నుంచే దందా జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఈడీ విచారణ జరిపి నిర్ధారించింది. జైలు అధికారుల సస్పెన్షన్‌తో పాటు జైలు నిర్వహణపై ఆస్తానా సూచించిన సిఫార్సులను అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. విచారణ సందర్భంగా బెంచ్‌తో నిందితుల న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా వాదించారు. తన క్లయింట్‌కు ఫోరెన్సిక్ ఆడిట్ తాలుకు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఈ కేసులో తన క్లయింట్ నిర్ధోషని తేలితే కాలాన్ని వెనక్కు తిప్పలేరని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా భాషను తాము అంగీకరించమన్నారు. విచారణ మధ్యలో ఉన్నందున నివేదికలు ఇప్పుడే బహిర్గతం చేయలేమన్నారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. -
యూనిటెక్ గ్రూప్ కేసులో లండన్ హోటల్ జప్తు
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ యునిటెక్, ఆ గ్రూప్ ప్రమోటర్ల సంజయ్ చంద్ర, అజయ్ చంద్రపై జరుగుతున్న అక్రమ ధనార్జనా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్య తీసుకుంది. లండన్‌లోని రూ.58.61 కోట్ల విలువచేసే ఒక హోటల్‌ను జప్తు చేసినట్లు ప్రకటించింది. ఈ హోటెల్ పేరు ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’. ఐబోర్న్‌షోర్న్‌కు చెందిన హోటెల్ ఇది. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్నౌస్టీ గ్రూప్‌కు అనుబంధ సంస్థగా ఐబోర్న్‌షోర్న్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈడీ తెలిపిన సమాచారం ప్రకారం, గృహ కొనుగోలుదారులకు చెందిన రూ.325 కోట్లను యూనిటెక్ గ్రూప్ కార్నౌస్టీ గ్రూప్‌కు బదలాయించింది. కార్నౌస్టీ గ్రూప్‌కు చెందిన కార్నౌస్టీ మేనేజ్మెంట్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఐబోర్న్‌షోర్న్‌లో షేర్ల కొనుగోలుకు ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని (రూ.41.3 కోట్లను) వినియోగించడం జరిగింది. ఈ కేసులో జరిగిన మోసం మొత్తం రూ.5,063.05 కోట్లని ఇప్పటి వరకూ అంచనా. -
రూ.165 కోట్లు తిరిగి చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పూర్తి డబ్బు చెల్లించి బహిరంగ వేలంలో దక్కించుకున్న భూమిని స్వాధీనం చేయడంలో విఫలమైనందుకు యూనిటెక్ కంపెనీకి చెల్లించాల్సిన అసలు రూ.165 కోట్లను తిరిగి ఆ కంపెనీకి చెల్లించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భూమిని స్వాధీనం చేయలేనప్పుడు ఆ కంపెనీ కట్టిన డబ్బును తిరిగిచ్చేయడం తప్పనిసరని, ఇందులో మరో మాటకు తావు లేదంది. రూ.165 కోట్లకు వడ్డీ చెల్లించాలా?లేదా? అన్నది తాము తేలుస్తామంది. రూ.165 కోట్లలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తమ వాటా కింద డబ్బు చెల్లించాలని భావిస్తుంటే, ఆ రాష్ట్రం నుంచి ఆ మేర వసూలు చేసుకోవచ్చునని, అయితే ముందు యూనిటెక్కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి తీరాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో వాదనలు వింటామంటూ తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని భూమికి సంబంధించి నిర్వహించిన బహిరంగ వేలంలో యూనిటెక్ సంస్థ రూ.165 కోట్ల బిడ్ వేసి విజేతగా నిలిచింది. అయితే ఈ భూమి యాజమాన్య హక్కులపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది. చివరకు ఈ భూమిని ప్రైవేటు భూమిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈలోపు రాష్ట్ర విభజన జరగడంతో తాము చెల్లించిన రూ.165 కోట్లను వెనక్కి ఇవ్వాలంటూ యూనిటెక్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రూ.660 కోట్లు చెల్లించాలన్న సింగిల్ జడ్జి... విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు, యూనిటెక్కు చెల్లించాల్సిన రూ.165 కోట్లకు వడ్డీ రూ.495.55 కోట్లను కలిపి మొత్తం రూ.660.55 కోట్లను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం తాము వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వేలానికి తమను బాధ్యులుగా చేయడం సరికాదని చెప్పారు. యూనిటెక్‌ను ఇబ్బందిపెట్టడం సరికాదు... దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘వడ్డీ సంగతి తర్వాత చూద్దాం.. ముందువారు కట్టిన రూ.165 కోట్లను చెల్లించండి. ఇందులో మరో మాటకు తావు లేవు. భూమిని స్వాధీనం చేయలేనప్పుడు కట్టిన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందే.’అని స్పష్టం చేసింది. ఏపీఐఐసీ ఆస్తి, అప్పులు విభజన జరగలేదని, అందువల్ల యూనిటెక్కు చెల్లించాల్సిన మొత్తంలో ఏపీ వాటా ఉందని సంజీవ్ చెప్పగా, అది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాల్సిన అంశమని, దీనిని సాకుగా చూపు తూ యూనిటెక్‌ను ఇబ్బందిపెట్టడం సరికాదంది. ముందు అసలు తీసుకోవాలని, ఆ తర్వాత వడ్డీ వ్యవహారాన్ని తేలుస్తామని యూనిటెక్కు సూచించింది. యూనిటెక్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి స్పందిస్తూ, అసలుతోపాటు వడ్డీకి సైతం తాము అర్హులమంటూ అందుకు సంబంధించిన నిబంధనలను చదివి వినిపించారు. -
జైళ్లో వారికి రాజభోగం..
న్యూఢిల్లీ : ఎల్ఈడీ టీవీ, కొబ్బరి నీరు, బ్యాడ్మింటన్ రాకెట్‌తో పాటు జైళ్లో అనుమతి లేని మరేన్నో వస్తువులతో తీహార్ జైళ్లో ఇంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్. గృహ వినియోగదారులను మోసం చేయడమే కాక మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్రా తీహార్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైలు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వీరికి అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ సహ ఖైదీ ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హై కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా ఆదేశించారు. దాంతో జైలులో వీరికి కల్పించిన రాజభోగాల గురించి బయటకు వచ్చింది. అవినీతిపరులైన అధికారలు డబ్బుకు ఆశపడి నిబంధనలు ఉల్లంఘించినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. -
యూనిటెక్కు రూ.660 కోట్లు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: యూనిటెక్ కంపెనీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వేలంలో దక్కించుకున్న భూమికి డబ్బు చెల్లించినా ఆ భూమిని స్వాధీనం చేయడంలో విఫలమైనందుకు అసలు రూ.165 కోట్లకు వడ్డీ రూ.495.55 కోట్లు కలిపి మొత్తం రూ.660.55 కోట్లను యూనిటెక్ కంపెనీకి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపులను నాలుగు వారాల్లో పూర్తి చేయాలంది. ఈ మొత్తాన్ని ఏపీ, ఏపీఐఐసీ నుంచి రాబట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇతర చట్ట నిబంధనల కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కోరేందుకు ఈ తీర్పు ఏమాత్రం అడ్డంకి కాదని యూనిటెక్ కంపెనీకి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పునిచ్చారు. ఇదీ వివాదం.. ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలో 350 ఎకరాల్లో ఏరోస్పేస్ పార్క్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏపీఐఐసీ 2007లో భూమి బహిరంగ వేలం నిర్వహించింది. అప్పటికే ఈ భూమి యాజమాన్యపు హక్కులపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ వేలంలో యూనిటెక్ విజేతగా నిలిచింది. నిబంధనల ప్రకారం ఏపీఐఐసీకి రూ.165 కోట్లు చెల్లించింది. న్యాయవివాదం నేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం యూనీటెక్‌కు స్వాధీనం చేయలేదు. ఆ భూమి యాజమాన్యపు హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2011లో హైకోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీఐఐసీ కాస్త టీఎస్ఐఐసీగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హæక్కుల్లేవంటూ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో యూనిటెక్ కంపెనీ తాము చెల్లించిన రూ.165 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఎస్ఐఐసీని కోరుతూ వచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తుది విచారణ జరిపి ఈ నెల 23న తీర్పు వెలువరించారు. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. యూనిటెక్, టీఎస్‌ఐఐసీల మధ్య వివాదం సాధారణమైందని, అందువల్ల ఆ కంపెనీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప హైకోర్టులో కాదన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాంట్రాక్టు సంబంధిత వివాదాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఒప్పందంలో మధ్యవర్తి క్లాజు ఉందని, అందువల్ల యూనిటెక్ కంపెనీ మధ్యవర్తిత్వం వైపు వెళ్లాలే తప్ప పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్న వాదనను కూడా ఆమోదించలేదు. మధ్యవర్తిత్వ క్లాజు ఉన్నంత మాత్రాన బాధిత వ్యక్తి దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత లేకుండా పోదన్నారు. అప్పటి వరకు వేచి ఉండాలంటే ఎలా? ఈ వివాదం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది కాబట్టి, ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉండాలన్న తెలంగాణ న్యాయవాది వాదనతో న్యాయమూర్తి విభేదించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఐఐసీ, టీఎస్ఐఐసీ మధ్య ఆస్తి, అప్పుల విభజన గత నాలుగేళ్లుగా పూర్తి కాలేదని, ఎప్పుడు పూర్తవుతుందో కూడా అంచనా వేయడం కష్టమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆస్తి, అప్పుల విభజన పూర్తయ్యేంత వరకు యునీటెక్‌ను వేచి ఉండాలనడం ఎంత మాత్రం సరికాదన్నారు. అనుకున్నట్లు ఏరోస్పేస్ ప్రాజెక్టు పూర్తయితే లబ్ధి పొందేది తెలంగాణేనని పేర్కొన్నారు. కాబట్టి యూనిటెక్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి టీఎస్‌ఐఐసీదే బాధ్యత అవుతుందన్నారు. యూనిటెక్కు చెల్లించాల్సిన మొత్తం విషయంలో ఏపీకి కూడా బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తే, దాన్ని ఆస్తి, అప్పుల విభజన సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చని తెలిపారు. -
యూనిటెక్ నష్టాలు రూ.73 కోట్లు
న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ కంపెనీ యూనిటెక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.16 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.73 కోట్లకు ఎగిశాయని యూనిటెక్ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.289 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.78 కోట్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,272 కోట్ల ఆదాయం రూ.218 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయని కారణంగా కంపెనీ ఎమ్‌డీలు ఇద్దరూ–సంజయ్ చంద్ర, అజయ్ చంద్ర జైలు శిక్ష గడుపుతున్నారు. -
యూనిటెక్ ఆస్తుల వేలానికి సుప్రీం ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై కొరడా ఝళింపించేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూనిటెక్ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని ఆదేశించింది. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలుదారులను యూనిటెక్ మోసగించింది. కనుక కొనుగోలుదారుల సొమ్మును తిరిగి చెల్లించాలంటే ఆ సంస్థ ఆస్తులను వేలం వేయాల్సిందేనని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీం తాజాగా ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన కోలకతా ఆస్తులను వేలం/విక్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా రూ.25కోట్లను కొనుగోలుదారుల డబ్బును తిరిగి చెల్లిచాలని కోరింది. అలాగే ఈ ప్రక్రియంలో సహకారం అందించేందుకు మరో ఇద్దరు వ్యక్తులను నియమించుకునేలా సుప్రీంకోర్టు సహాయకుడు ఎమికస్ క్యూరీ పవన్శ్రీ అగర్వాల్‌కు అనుతినిచ్చింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. సంస్థ డైరెకర్ట వ్యక్తిగత ఆస్తులతోపాటు ఇతర ఆస్తుల వివరాలను అందించాలని, మే 11 నాటికి 100 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయకపోతే వారి ఆస్తులను వేలం వేయాలని సుప్రీం యూనిటెక్ సంస్థను గతంలో హెచ్చరించింది. అయితే యూనిటెక్ సమర్పించిన నివేదికపై అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలోనే యూనిటెక్కు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, వారణాసి, తమిళనాడులోని శ్రీపెరంబుదుర్లోని ఆస్తులను విక్రయించి, ఆ సొమ్మును గృహ కొనుగోలుదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని జూలై 5న కమిటీని కోరింది. కాగా కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి సరైన సమయంలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేదన్న ఆరోపణలపై యూనిటెక్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు మరో డైరెక్టర్ అజయ్ చంద్ర గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. -
వెయ్యి కోట్లకు యూనిటెక్ నష్టాలు
న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ యూనిటెక్ నష్టాలు మరింతగా పెరిగాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.290 కోట్లుగా ఉన్న నికర నష్టాలు 2017–18 క్యూ4లో రూ.1,000 కోట్లకు పెరిగాయి. ఆదాయం అధికంగా ఉన్నా నికర నష్టాలు భారీగా పెరిగాయని యూనిటెక్ తెలిపింది. నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండటం, రూ.928 కోట్ల అసాధారణ లావాదేవీ కారణంగా నష్టాలు ఈ స్థాయిలో వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.480 కోట్ల నుంచి రెండు రెట్లు పెరిగి రూ.978 కోట్లకు చేరుకుందని తెలియజేసింది. పూర్తి సంవత్సరంలో... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.403 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,275 కోట్లకు పెరిగాయని యూనిటెక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,795 కోట్ల నుంచి రూ.2,210 కోట్లకు వృద్ధి చెందింది. యూనిటెక్ కంపెనీ నష్టాలు రూ.వెయ్యి కోట్లకు పెరగడంతో బీఎస్ఈలో యూనిటెక్ షేర్ 6 శాతం పతనమైంది. ఇంట్రాడేలో 7 శాతం నష్టంతో రూ.4.85కు పతనమైన ఈ షేర్ చివరకు 6 శాతం నష్టంతో రూ.4.88 వద్ద ముగిసింది. భారీ రుణాల్లో కూరుకుపోయిన ఈ కంపెనీ చేపట్టిన ప్రాజెక్ట్‌ల్లో తీవ్రంగా జాప్యం జరుగుతుండటంతో కొనుగోలు దారుల నుంచి నిరసనలు, కోర్టు కేసులను ఈ కంపెనీ ఎదుర్కోవలసి వస్తోంది. -
ఆస్తులను వేలం వేస్తాం: తీవ్రంగా హెచ్చరించిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ సంస్థ యూనిటెక్ కస్టమర్లు కొనుగోలు చేసిన ఇంటిని స్వాధీనం చేయకుండా మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఇప్పటికే పలుసార్లు ఆదేశించిన సుప్రీం సోమవారం మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గృహ కొనుగోలు దారులను దారుణంగా మోసం చేశారంటూ యూనిటెక్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు కొనుగోలుదారులకు సొమ్మును తిరిగి చెల్లించే నిమిత్తం యునిటెక్‌కు చెందిన ఆస్తులను వేలం వేస్తామని సుప్రీం గట్టిగా హెచ్చరించింది. ఇందుకుగాను బోర్డు డైరెక్టర్లు వ్యక్తిగత ఆస్తులు సహా సంస్థ ఇతర దేశీ, విదేశీ ఆస్తుల వివరాలను అందించాలని ఆదేశించింది. కాగా మార్చి 5 న, ఆస్తుల పూర్తి వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాలని కంపెనీని కోర్టు కోరింది. అయితే ఈ జాబితా అసంపూర్తిగా ఉందని సంస్థ పేర్కొంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సుప్రీం ధర్మాసనం దీనికి సంబంధించిన పూర్తి జాబితాను 15రోజుల్లో సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. జెఎం ఫైనాన్స్, ఏఆర్సీకి జరిమానా అలాగే కేసును జెఎం ఫైనాన్స్ లిమిటెడ్,ఏ ఆర్సీ లిమిటెడ్‌కు సుప్రీం మరో షాక్ ఇచ్చింది. కోర్టును తప్పు దోవ పట్టిస్తున్నారంటూ జెఎం ఫైనాన్స్ లిమిటెడ్, ఏఆర్‌సీపై సుప్రీం మండిపడింది. కస్టమర్లకు తిరిగి డబ్బులు చెల్లించేందుకు కోర్టులో సొమ్మును డిపాజిట్ చేస్తారని విశ్వసించాం. కానీ కస్టమర్లను సమస్యనుంచి పక్కదారి పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. -
‘కేంద్రం చేతికి యూనిటెక్’.. సుప్రీం స్టే
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్ పగ్గాలను కేంద్రం తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఇందుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలన్నీ జరక్కుండా ఉండాల్సిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అంగీకరించిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రస్తుతం జైల్లో ఉన్న యూనిటెక్ చీఫ్ సంజయ్‌చంద్ర... కంపెనీ ఆస్తుల విక్రయానికి సంబంధించి చర్చలను పునరుద్ధరించగలుగుతారు. ఇందుకు అనుగుణంగా న్యాయవాదులు, కంపెనీ అధికారులతో సంజయ్‌చంద్ర చర్చించడానికి జైలు అధికారులు వీలు కల్పించాల్సి ఉంటుంది. కేసు డైరీ ఇదీ... ♦ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించినప్పటికీ... ప్రాజెక్టును ప్రారంభించడం లేదన్న ఆరోపణలపై యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, ఆయన సోదరుడు అజయ్ చంద్రలను ఆర్థిక నేరాల విభాగం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ చేసింది. ♦ సంజయ్ చంద్ర బెయిల్‌కు డిసెంబర్‌లోగా రూ.750 కోట్లు డిపాజిట్ చేయాలని అక్టోబర్ 30న సుప్రీం యూనిటెక్‌ని ఆదేశించింది. ♦ అయితే నిర్వహణ లోపాలు, మేనేజ్మెంట్ నిధులు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో కంపెనీ యాజమాన్య బాధ్యతలను తమ చేతికి అప్పగించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) పిటిషన్ దాఖలు చేసింది. ♦ ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ గడచిన శుక్రవారం (డిసెంబర్ 8) కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ యాజమాన్య బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగించే దిశగా యూనిటెక్ 8 మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని, వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచించింది. తాజా ఆదేశాలపై సమాధానం ఇవ్వాలని అటు యూనిటెక్కు కూడా నోటీసులు జారీ చేసింది. ♦ దీనిని యూనిటెక్ తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో కంపెనీ కేసు విచారణ జరుగుతోందని ఎన్సీఎల్టీకి యూనిటెక్ నివేదించింది. ఇతరత్రా న్యాయస్థానాలేవీ కంపెనీపై బలవంతంగా ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతిని తెలియజేసింది. తాజా ఉత్తర్వుల వల్ల తాము సుప్రీం కోర్టుకు రూ. 750 కోట్లు డిపాజిట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. అయితే, మధ్యంతర ఆదేశాలను రద్దు చేయడానికి ఎన్సీఎల్టీ నిరాకరించింది. ♦ దీనితో సోమవారం యూనిటెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ♦ ఆదేశాలు ఇచ్చే ముందు అటు కేంద్రం ఇటు ట్రిబ్యునల్ తనను సంప్రదించి ఉండాల్సిందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా విజ్ఞప్తి మేరకు కేసు విచారణను నేటికి (బుధవారం) వాయిదా వేసింది. ♦ ఈ కేసులో ఆయా పరిణామాలు జరక్కుండా ఉండిఉండాల్సిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అంగీకరించడంతో తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్న విషయం ఉన్నట్లు అంగీకరించినందుకు అటార్నీ జనరల్‌ను ధర్మాసనం అభినందించింది. అటు ధర్మాసనంపై ఇటు గృహ కొనుగోలుదారులపై ఉండే ఒత్తిడిని ఆయన వైఖరి తగ్గిస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని వ్యాఖ్యానించింది. ♦ ఈ కేసులో దాదాపు 20,000 గృహ కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న విమర్శ ఉంది. యూనిటెక్ రుణభారం రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయింది. సుమారు 70 ప్రాజెక్టుల్లో దాదాపు 16,000 ఇళ్లను కొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. షేర్ 14 శాతం డౌన్! గత రెండు రోజులుగా నేషనల్‌స్టాక్ ఎక్స్చేంజిలో పెరుగుతూ వస్తున్న యూనిటెక్ షేర్ ధర తాజా వార్తల నేపథ్యంలో భారీగా పడింది. 14 శాతం (రూ.1.05) నష్టపోయి 6.60 వద్ద ముగిసింది. ఒక దశలో 16 శాతంపైగా షేర్ ధర పతనమైంది. -
యూనిటెక్కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం యూనిటెక్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. యూనిటెక్ వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిర్ణయాన్ని తప్పుపట్టిన అత్యున్నత ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్న ఎన్సీఎల్టీ ఆదేశాలపై స్టే విధించింది. గృహ కొనుగోలుదారులు, ఇతర ఇన్వెస్టర్ల ప్రయోజనాలకోసం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను జనవరి 12కి వాయిదా వేసింది. యూనిటెక్ స్వాధీనంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్సీఎల్టీ భారీ షాకిచ్చింది. ఎన్సీఎల్టీ ఆదేశాలపై సంక్షోభంలో చిక్కుకున్న యూనిటెక్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది. యూనిటెక్ పిటీషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీం ఎన్సీఎల్టీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసును నేటికి వాయిదా వేసింది. కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఎన్సీఎల్టీ డిసెంబర్ 8 ఆదేశాలు జారీచేసింది. అలాగే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కేంద్రాన్నిఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 20లోగా అందించాలని సూచించిన సంగతి తెలిసిందే. -
యూనిటెక్ టేకోవర్‌పై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ దిగ్గజం యూనిటెక్ టేకోవర్‌పై సుప్రీంకోర్టు ఎన్సీఎల్టీకి అక్షింతలు వేసింది. అత్యున్నత కోర్టు విచారిస్తున్న కేసులో ఎన్సీఎల్టీ స్పందనపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని, ఇది చాలా డిస్టర్బింగ్ ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. యునిటెక్ నుంచి గృహాలను కొనుగోలు చేసినవారి ప్రయోజనాలను ఎలా కాపాడాలనే దానిపై కోర్టుకు సూచించాలని కేంద్రాన్ని కోరింది. యూనిటెక్ బోర్డు రద్దు, కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ఎన్సీఎల్టీ తమను సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఎన్సీఎల్టీ, మంత్రిత్వ శాఖ నిర్ణయంపై యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది ఈ నేపథ్యంతో మంగళవారం యూనిటెక్ వాదనలను విన్న సుప్రీం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎన్సీఎల్టీ, మంత్రిత్వ శాఖ సుప్రీం అనుమతి తీసుకోవాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎన్ ఖాన్విల్కర్, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే డిసెంబర్ చివరి నాటికి రూ.750కోట్లుచెల్లించాలని యూనిటెక్‌నుఆదేశించింది. బోర్డు డైరెక్టర్ల రద్దు అంశాన్ని రేపు (బుధవారం) విచారించనున్నట్టు వెల్లడించింది. మరోవైపు కేంద్రం యూనిటెక్ ఛాలెంజ్‌పై వాదనలను వినిపించేందుకు కేంద్రం గడువు కావాలని సుప్రీంను కోరింది. -
ఎన్సీఎల్టీ ఆర్డర్‌పై సుప్రీంకు యూనిటెక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం చర్యపై రియాల్టీ సంస్థ యూనిటెక్ సోమవారం సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్టీ ఆర్డర్‌ను సుప్రీంలో సవాల్ చేసింది. ట్రిబ్యునల్ ఆర్డర్‌పై ప్రభుత్వం ఆధీనంలోకి రానున్న యూనిటెక్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై యూనిటెక్ వాదనలను రేపు (డిసెంబర్ 12) న సుప్రీం విననుంది. కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గట్టి షాకిచ్చింది. ని డైరెక్టర్లు వ్యక్తిగత లేదా సంస్థ ఆస్తులను విక్రయించకుండా నిరోధించడంతోపాటు, తదుపరి విచారణ నాటికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుఎన్‌సీఎల్ వివరించింది తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న యూనిటెక్ షేరు జోరు
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి స్టాక్మార్కెట్లో భారీ ఊరట లభించింది. నిర్వహణ నియంత్రణను చేపట్టేందుకు ప్రభుత్వానికి అనుమతించటంతో యునిటెక్ షేర్లు ఈ రోజు కూడా భారీగా లాభపడుతున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్‌తో శుక్రవారం19శాతానికి పైగా లాభపడిన యూనిటెక్ సోమవారం కూడా తన జోరును కొనసాగిస్తోంది. 16శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతోంది. కంపెనీపై అజమాయిషీ తీసుకునే బాటలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) యూనిటెక్‌కి గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచన చేసింది. -
ప్రభుత్వం చేతికి యూనిటెక్ పగ్గాలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచన చేసింది. తాజా ఆదేశాలపై సమాధానం ఇవ్వాలని జస్టిస్ ఎం.ఎం.కుమార్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ అటు యూనిటెక్కు కూడా నోటీసులు జారీ చేసింది. తొలగించిన ఎనిమిది మంది డైరెక్టర్లు తమ వ్యక్తిగత, కంపెనీ ఆస్తులను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ఈ విషయాలు వెల్లడించారు. నిర్వహణ లోపాలు, మేనేజ్మెంట్ నిధు లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో కంపెనీ యాజమాన్య బాధ్యతలను తమ చేతికి అప్పగించాలంటూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) పిటిషన్ వేసిన దరిమిలా ట్రిబ్యునల్ ఈ ఆదేశాలిచ్చింది. కంపెనీని మూసివేయడానికి తగిన కారణాలున్నా.. 19,000 పైచిలుకు గృహాల కొనుగోలుదారులు, చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్య బాధ్యత లు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎంసీఏ వాదనలు వినిపించింది. యూనిటెక్ డైరెక్టర్ల జాబితాలో చైర్మన్ రమేష్ చంద్ర, ఎండీలు అజయ్ చంద్ర, సంజయ్ చంద్ర తదితరులు ఉన్నారు. యూనిటెక్ రుణభారం రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయింది. సుమారు 70 ప్రాజెక్టుల్లో దాదాపు 16,000 ఇళ్లను కొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించినప్పటికీ... ప్రాజెక్టును ప్రారంభించడం లేదన్న ఆరోపణలపై యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, ఆయన సోదరుడు అజయ్ చంద్రలను ఆర్థిక నేరాల విభాగం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ చేసింది. సంజయ్ చంద్ర, అజయ్ చంద్రలను బెయిల్ కోసం డిసెంబర్‌లోగా రూ.750 కోట్లు డిపాజిట్ చేయాలంటూ అక్టోబర్ 30న సుప్రీం కోర్టు యూనిటెక్‌ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకిది విరుద్ధం: యూనిటెక్ ఉదయం పూట వాదనల్లో పాల్గొనని యూనిటెక్.. మధ్యాహ్నం ఎన్సీఎల్టీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో తమ కేసు విచారణ జరుగుతోందని నివేదించింది. ఇతరత్రా న్యాయస్థానాలేవీ కంపెనీపై బలవంతంగా ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలను పక్కనపెట్టాలని కోరింది. తాజా ఉత్తర్వుల వల్ల తాము సుప్రీం కోర్టుకు రూ. 750 కోట్లు డిపాజిట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి ఎన్సీఎల్టీ నిరాకరించింది. సుప్రీం ఆదేశాలను పాటించడాన్ని బట్టి తాజా ఉత్తర్వుల అమలు ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం బీఎస్ ఈలో యూనిటెక్ షేర్ 20% లాభపడి రూ.7.29 దగ్గర ముగిసింది. అప్పట్లో సత్యం.. ఇప్పుడు యూనిటెక్.. ప్రభుత్వం స్వయంగా ప్రైవేట్ కంపెనీ యాజమాన్య బాధ్యతలను టేకోవర్ చేయడంపై దృష్టి పెట్టడం అరుదైన సందర్భం. సత్యం కంప్యూటర్స్ ఉదంతం తర్వాత ప్రభుత్వం మళ్లీ ఇలాం టి విషయంలో జోక్యం చేసుకోవడం ఇదే ప్రథమం. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 241 కింద ఎంసీఏ పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 241 (2) ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారా లు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని భావించిన పక్షంలో సదరు సంస్థ యాజమాన్య బాధ్యతలు తనకు దఖలుపడేలా ఆదేశాలివ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎల్టీని తనంతట తానే స్వయంగా ఆశ్రయించవచ్చు. -
చీటింగ్ కేసులో రియల్ ఎస్టేట్ ఎండీల అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యునిటెక్ మేనేజింగ్ డైరెక్టర్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 35 కోట్ల మనీలాండరింగ్ కేసులో యూనిటెక్ డైరెక్టర్లు సంజయ్ చంద్ర, సంజయ్ సోదరుడు అజయ్ చంద్ర ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు. కొనుగోలుదారులను మోసం చేయడంతోపాటు, ప్రాజెక్ట్ ప్రారంభించటానికి ముందు సంబంధిత అధికారులు నుంచి అనుమతులు తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గుర్గాంలోని సెక్టార్ 70 లోని ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి లబ్దిదారులకు అందించడంలో యూనిటెక్ విఫలమైంది. దీంతోపాటు, వడ్డీతో సహా బాధితులకు తిరిగి నగదు చెల్లించడంలో కూడా నిర్లక్ష్యం చూపడంతో వీరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో తమ బృందం శుక్రవారం రాత్రి వారిఇంటిపై దాడిచేసి పట్టుకున్నట్టు అధికారి మాధుర్ వర్మ తెలిపారు. వీరిపై 91 ఫిర్యాదులు ఉన్నట్టు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. కాగా యూనిటెక్ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ప్లాట్ కొనుగోలు కోసం 39 మంది కొనుగోలు దారులు చెల్లించిన రూ.16.55 కోట్లపై ఏడాదికి 14శాతం వడ్డీతో కలిపి మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించిన సంగతి తెలిసిందే. -
యూనిటెక్కు మరోసారి షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ లిమిటెడ్ కు మరోసారి సుప్రీంకోర్టు షాకిచ్చింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గుర్గావ్ విస్తా ప్రాజెక్టుకు సంబంధించి 34 మంది బాధితులకు సుమారు 15 కోట్ల రూపాయలను రిఫండ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐదు కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని యునిటెక్ మేనేజ్-మెంటును ఆదేశించింది. మిగిలిన మొత్తాన్ని సెప్టెంబర్ చివరి నాటికి చెల్లించాలని తీర్పు చెప్పింది. కాగాపరిహారం చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం గతనెలలోనే హెచ్చరించింది. యూనిటెక్ గ్రూప్ కు చెందిన నోయిడా , గుర్గావ్ ప్రాజెక్టులలో కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో బాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (ఎన్ సీడీఆర్ సీ)ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడంపై సీరియస్-గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లించడానికి ఆగస్టు 12 వరకు గడువు ఇవ్వడంతోపాటు, జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజా యూనిటెక్ తమ దగ్గర డబ్బులు ల్లేవని సుప్రీంముందు నిస్పహాయతను వ్యక్తం చేసింది. అయితే యూనిటెక్ నుంచి సొమ్మును వాపసు కోరుతున్నవారి వివరాలు సమర్పించాలని ఫ్లాట్ కొనుగోలుదారులను శుక్రవారం బెంచ్ కోరిన సంగతి తెలిసిందే. -
చేతులెత్తేసిన యూనిటెక్..ఢమాలన్న షేరు
న్యూఢిల్లీ: పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్ లిమిటెడ్ మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇబ్బందుల్లో పడిన సంస్థ చెల్లింపుల విషయంలో చివరికి చేతులెత్తేసింది. నోయిడా, గుర్గావ్ దాని రెండు ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా.. ఇళ్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించలేమని సుప్రీం ముందు మంగళవారం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీంతో మార్కెట్ లో యూనిటెక్ షేరు అమ్మకాల హోరు కొనసాగింది. దాదాపు షేర్ 20 శాతం పతనమై 4.92 స్థాయికి దిగజారింది. ''మా దగ్గర డబ్బుల్లేవు.. డబ్బులుండి వుంటే.. నిర్మాణాలు పూర్తి చేసి వారికి స్వాధీనం చేసి వుండేవారమని'' యూనిటెక్ సీనియ న్యాయవాది ఏ ఎంసింఘ్వీ, జస్టిస్ దీపక్ మిశ్రాల, యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం ముందు చెప్పారు. ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును వెనక్కి(రిఫండ్) ఇచ్చే పరిస్థితుల్లో తాము లేమంటూ సుప్రీం కోర్టుకు యూనిటెక్ నివేదించింది. దీంతో సొమ్ము వెనక్కి ఆశిస్తున్న వినియోగదారుల జాబితాను సిద్ధం చేయమని ఆదేశిస్తూ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసినట్లు సమాచారం. నోయిడా, గుర్గావ్ యూనిటెక్ ప్రాజెక్ట్‌లను రెండు డజన్లకు పైగా ఇళ్లు కొనుగోలుదారులు తమకు ఫ్లాట్ల స్వాధీనం చేయడంలో విఫలమైన యూనిటెక్ తమకు డబ్బు తిరిగి చెల్లించాలని కోరుతూ నేషనల్ కన్స్యూమర్ రెడ్రెస్సల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారికి వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా సుప్రీం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వివాదం ఇలా ఉండగా బీఎస్ఈ ఈ విషయంపై యూనిటెక్ నుంచి వివరణ కోరింది. -
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ కు భారీ షాక్ తగిలింది. నోయిడాలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 5 కోట్ల మధ్యంతర నష్టపరిహారాన్ని ఆగస్టు 12 వ తేదీలోపుగా చెల్లించాలని యునిటెక్ సీనియర్ మేనేజ్ మెంటును ఆదేశించింది. లేని పక్షంలో జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సంస్థ డైరెక్టర్లను ధర్మాసనం హెచ్చరించింది. యూనిటెక్ గ్రూప్, బుర్గుండి సొసైటీలో నోయిడా సెక్టార్ 76 ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను స్వాధీనం చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోబాధితులు నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ ( ఎన్సీడీఆర్సీ ) ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కమిషన్ నష్టపరిహారం చెల్లించాల్సింది ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేయడం సీరియస్ గా స్పందించిన కోర్టు యూనిటెక్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.తక్షణమే పరిహారం చెల్లించాలని ఆగస్టు 12 వరకు గడువిచ్చింది. దీంతోపాటుగా ఈ గడువు లోపు చెల్లించడంలో విఫలమైతే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో మార్కెట్లో షేరు ఢమాల్ అంది. శుక్రవారం నాటి ఇంట్రా డే మార్కెట్ లో సుమారు రెండు శాతం నష్టాలతో ట్రేడవుతోంది. కాగా గుర్గావ్ కు చెందిన సంజయ్ అరోరో 2006 నవంబరులో గ్రేటర్ నోయిడాలోని యూనిటెక్ లిమిటెడ్ ప్రాజెక్టులో బుక్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం 36 నెలల్లో ఫ్లాట్‌ను అప్పగించలేదు సరికదా తనను తీవ్రంగా వేధించిందంటూ సంజయ్ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించారు. దీనిపై కమిషన్ విచారణ జరిపింది. యూనిటెక్‌పై అనేక కేసులు కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, 144 మంది ఉమ్మడిగా చేసిన ఫిర్యాదు కూడా విచారణలో ఉందని తెలిపింది. ఇంటిని కొనాలన్న కోరిక పిటిషనర్ సంజయ్ అరోరా జీవితాన్ని నాశనం చేసిందని వ్యాఖ్యానించింది. యూనిటెక్ ఆయనను తీవ్రంగా వేధించిందని పేర్కొంది. ప్రాజెక్టు పనులు జరగని సమయంలో అరోరా చెల్లింపుల్లో ఆలస్యం జరిగినపుడు, ఆ సొమ్ముపై వడ్డీ చెల్లించాలని యూనిటెక్ కోరడం సహేతుకం కాదని తెలిపింది. దాదాపు తొమ్మిదేళ్ళు గడచిన తర్వాత అనేక సమస్యలు ఉన్న మరో ఫ్లాట్‌ను తీసుకోమని చెప్పడం సరికాదని పేర్కొంది. ఫిర్యాదుదారు ఆరోగ్యాన్ని కోల్పోయారని, ఇబ్బందులు పడ్డారని పేర్కొన్న కమిషన్ సంజయ్ అరోరాకు రూ.59,98,560ను సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు వ్యాజ్య ఖర్చుల కోసం మరో రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశించింది. యూనిటెక్ వద్ద డిపాజిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో యూనిటెక్ షేర్ ధర శుక్రవారం 1.5 శాతం ఇంట్రా డే పడిపోయింది. -
టాటా-యూనిటెక్‌పై స్థాయీ నివేదిక
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, రియల్టీ సంస్థ యూనిటెక్ మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తును చేపట్టిన ఆర్థిక నేరాల పరిశోధన సంస్థ ఎస్ఎఫ్ఐవోను స్థాయీ నివేదిక(స్టేటస్ రిపోర్ట్) ఇవ్వాల్సిందిగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అయితే లావాదేవీలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను రెండు కంపెనీలు తోసిపుచ్చాయి. కాగా, నీరా రాడియాకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ‘వైష్ణవి’కి చెందిన వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా గతేడాది ఆర్థిక శాఖ ఎస్ఎఫ్ఐవోను ఆదేశించిన సంగతి తెలిసిందే. వైష్ణవి సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలతోపాటు, యూనిటెక్కు సంబంధించిన మీడియా రిలేషన్స్‌ను నిర్వహిస్తుంది. ఈ కేసుపై ఎస్ఎఫ్ఐవో తుది నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ అంశంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్ స్పందిస్తూ ఇంతవరకూ తమకు నివేదిక అందలేదని చెప్పారు. ప్రస్తుతం స్టేటస్ రిపోర్ట్‌ను ఇవ్వాల్సిందిగా ఎస్ఎఫ్ఐవోను ఆదేశించినట్లు తెలిపారు. కంపెనీల ఇష్టానికే సీఎస్ఆర్: తమ విధానాలు, బిజినెస్ వంటి అంశాల ఆధారంగా కంపెనీలు కార్పొరేట్ సామాజిక సేవా(సీఎస్ఆర్) కార్యక్రమాలను చేపట్టవచ్చునని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ పేర్కొన్నారు. సీఐఐ ఇక్కడ ఏర్పాటు చేసిన సీఎస్ఆర్ జాతీయ సదస్సుకు హాజరైన పైలట్... ఈ విషయంలో కంపెనీలకు తగిన స్వేచ్ఛ ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం కంపెనీల కొత్త చట్టంలో భాగమైన సీఎస్ఆర్కు సంబంధించి ప్రభుత్వం స్వేచ్చా విధానాలను అవలంబించనున్నదని వివరించారు.