టాటా-యూనిటెక్‌పై స్థాయీ నివేదిక
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, రియల్టీ సంస్థ యూనిటెక్ మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తును చేపట్టిన ఆర్థిక నేరాల పరిశోధన సంస్థ ఎస్‌ఎఫ్‌ఐవోను స్థాయీ నివేదిక(స్టేటస్ రిపోర్ట్) ఇవ్వాల్సిందిగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అయితే లావాదేవీలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను రెండు కంపెనీలు తోసిపుచ్చాయి. కాగా, నీరా రాడియాకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ‘వైష్ణవి’కి చెందిన వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా గతేడాది ఆర్థిక శాఖ ఎస్‌ఎఫ్‌ఐవోను ఆదేశించిన సంగతి తెలిసిందే. వైష్ణవి సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలతోపాటు, యూనిటెక్‌కు సంబంధించిన మీడియా రిలేషన్స్‌ను నిర్వహిస్తుంది. ఈ కేసుపై ఎస్‌ఎఫ్‌ఐవో తుది నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ అంశంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్ స్పందిస్తూ ఇంతవరకూ తమకు నివేదిక అందలేదని చెప్పారు. ప్రస్తుతం స్టేటస్ రిపోర్ట్‌ను ఇవ్వాల్సిందిగా ఎస్‌ఎఫ్‌ఐవోను ఆదేశించినట్లు తెలిపారు.
కంపెనీల ఇష్టానికే సీఎస్‌ఆర్: తమ విధానాలు, బిజినెస్ వంటి అంశాల ఆధారంగా కంపెనీలు కార్పొరేట్ సామాజిక సేవా(సీఎస్‌ఆర్) కార్యక్రమాలను చేపట్టవచ్చునని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ పేర్కొన్నారు. సీఐఐ ఇక్కడ ఏర్పాటు చేసిన సీఎస్‌ఆర్ జాతీయ సదస్సుకు హాజరైన పైలట్... ఈ విషయంలో కంపెనీలకు తగిన స్వేచ్ఛ ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం కంపెనీల కొత్త చట్టంలో భాగమైన సీఎస్‌ఆర్‌కు సంబంధించి ప్రభుత్వం స్వేచ్చా విధానాలను అవలంబించనున్నదని వివరించారు.