సాక్షి, న్యూఢిల్లీ : లూటెన్స్ ఢిల్లీలోని ప్రఖ్యాత హోటల్ తాజ్ మాన్‌సింగ్ లీజు హక్కులను టాటా గ్రూప్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ పునరుద్ధరించుకుంది. శుక్రవారం నాటి వేలంలో ఈ హోటల్ లీజు హక్కులను టాటా గ్రూప్ మరోసారి దక్కించుకుందని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారి పేర్కొన్నారు. ‘ 33 ఏళ్లుగా తాజ్ మాన్‌సింగ్ హోటల్ టాటా గ్రూప్ ఆధీనంలోనే ఉంది. అయితే 2011లోనే ఇందుకు సంబంధించిన లీజు హక్కులు ముగిశాయి. అలాగే లీజు ఫీజు రెట్టింపు చేసిన నేపథ్యంలో టాటా గ్రూపు అనేకమార్లు తాత్కాలిక పొడగింపులు కోరింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన వేలంలో నెలకు 7.3కోట్ల రూపాయలు(జీఎస్టీతో సహా) చెల్లించి తాజ్ మాన్‌సింగ్‌ను తమతో అట్టిపెట్టుకునేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. ఇది మునపటి ఫీజు కన్నా రెండింతలు ఎక్కువ. గతంలో వారు 3.94 కోట్ల రూపాయలు చెల్లించేవారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా 1978లో టాటా గ్రూప్ తాజ్ మాన్‌సింగ్ హోటల్‌ను 33 ఏళ్లకు గాను లీజుకు తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ గడువు 2011లో తీరిపోయినప్పటికీ.. లీజు హక్కులను పునరుద్ధరించుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో చట్టపరంగా ముందుకు వెళ్తామంటూ ఎన్‌డీఎంసీ ప్రకటించిన తర్వాత లీజును పునరుద్ధరించుకునేందుకు తొమ్మిదిసార్లు తాత్కాలిక పొడగింపుల ద్వారా ఉపశమనం పొందింది. ఈ క్రమంలోనే ఈ లీజు హక్కుల కోసం ఎన్‌డీఎమ్‌సీ శుక్రవారం వేలం నిర్వహించింది. కాగా ఈ వేలంలో ఐటీసీ నుంచి తీవ్ర పోటీ ఏర్పడిన నేపథ్యంలో భారీ మొత్తం చెల్లించి మరోసారి తాజ్ మాన్‌సింగ్‌ను టాటా గ్రూప్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment