taj mansingh hotel
-
‘తాజ్ మాన్సింగ్’ కోసం నెలకు రూ. 7.3 కోట్లు!!
సాక్షి, న్యూఢిల్లీ : లూటెన్స్ ఢిల్లీలోని ప్రఖ్యాత హోటల్ తాజ్ మాన్సింగ్ లీజు హక్కులను టాటా గ్రూప్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ పునరుద్ధరించుకుంది. శుక్రవారం నాటి వేలంలో ఈ హోటల్ లీజు హక్కులను టాటా గ్రూప్ మరోసారి దక్కించుకుందని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారి పేర్కొన్నారు. ‘ 33 ఏళ్లుగా తాజ్ మాన్సింగ్ హోటల్ టాటా గ్రూప్ ఆధీనంలోనే ఉంది. అయితే 2011లోనే ఇందుకు సంబంధించిన లీజు హక్కులు ముగిశాయి. అలాగే లీజు ఫీజు రెట్టింపు చేసిన నేపథ్యంలో టాటా గ్రూపు అనేకమార్లు తాత్కాలిక పొడగింపులు కోరింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన వేలంలో నెలకు 7.3కోట్ల రూపాయలు(జీఎస్టీతో సహా) చెల్లించి తాజ్ మాన్సింగ్ను తమతో అట్టిపెట్టుకునేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. ఇది మునపటి ఫీజు కన్నా రెండింతలు ఎక్కువ. గతంలో వారు 3.94 కోట్ల రూపాయలు చెల్లించేవారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 1978లో టాటా గ్రూప్ తాజ్ మాన్సింగ్ హోటల్‌ను 33 ఏళ్లకు గాను లీజుకు తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ గడువు 2011లో తీరిపోయినప్పటికీ.. లీజు హక్కులను పునరుద్ధరించుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో చట్టపరంగా ముందుకు వెళ్తామంటూ ఎన్డీఎంసీ ప్రకటించిన తర్వాత లీజును పునరుద్ధరించుకునేందుకు తొమ్మిదిసార్లు తాత్కాలిక పొడగింపుల ద్వారా ఉపశమనం పొందింది. ఈ క్రమంలోనే ఈ లీజు హక్కుల కోసం ఎన్డీఎమ్సీ శుక్రవారం వేలం నిర్వహించింది. కాగా ఈ వేలంలో ఐటీసీ నుంచి తీవ్ర పోటీ ఏర్పడిన నేపథ్యంలో భారీ మొత్తం చెల్లించి మరోసారి తాజ్ మాన్సింగ్ను టాటా గ్రూప్ దక్కించుకుంది. -
‘తాజ్’ను వేలం వేయాల్సిందే’
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రముఖ తాజ్‌మహల్ హోటల్(తాజ్ మాన్సింగ్)ను వేలం వేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టాటా గ్రూపు నడుపుతున్న ఈ హోటల్‌కు సంబంధించిన 33 ఏళ్ల అద్దె ముగియడంతో దానిని ఖాళీ చేయాలని తెలిపింది. అయితే, వేలంలో టాటా గ్రూపు పాల్గొని దానిని దక్కించుకోలేకపోతే ఖాళీ చేసేందుకు ఆరు నెలల సమయం ఉంటుందని కూడా వివరించింది. ఢిల్లీలో తాజ్ మాన్‌సింగ్‌గా పేరొందిన ఈ హోటల్‌ను 33 ఏళ్లపాటు టాటా గ్రూపు అద్దెకు తీసుకొని నడుపుతోంది. ఆ గడువు 2011లో ముగిసినప్పటికీ పలుమార్లు పొడిగించుకుంటూ ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు అవకాశం పొందింది. అయితే, గత నెల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక అధికారులతో సమావేశం అయ్యి ఈ హోటల్‌ను వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలం వేయకుండానే తమకు మరోసారి లీజ్‌ను పొడిగించాలంటూ టాటా సంస్థ కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కేజ్రీవాల్ వేలానికి వెళ్లాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేజ్రీవాల్ నిర్ణయానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. -
టాటా గ్రూపునకు ఊరట
న్యూఢిల్లీ: టాటా మిస్త్రీ వివాదంలో తంటాలు పడుతున్న టాటా గ్రూపునకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కు చెందిన ప్రతిష్ఠాత్మక తాజ్ మాన్సింగ్ హోటల్ వేలం ప్రక్రియలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. తాజ్ మాన్సింగ్ హోటల్ వేలాన్ని అడ్డుకోవాలన్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్). పిటీషన్ ను విచారించిన న్యాయమూర్తులు పీసీ ఘోష్, యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.. ఎన్డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ) పిటీషన్ ను తిరస్కరించిన కోర్టు అత్యద్భతమైన ఈ ప్రాచీన హోటెల్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. నడుస్తున్న హోటల్ కు సంబంధించి తాజా బుకింగ్స్ అడ్డుకోవడం కష్టమని, సంయమని పాటించాలని పేర్కొంది. తదుపరి వాదనల సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వేసింది కాగా ఢిల్లీలోని మాన్సింగ్ రోడ్డులో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఇండియన్ హోటల్స్‌కు ఎన్డీఎంసీ 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ గడువు 2011తో ముగిసింది. తదుపరి 9 సార్లు లీజును పొడిగించారు. ఈ వివాదంలో ఈ హెటెల్ వేలానికి ఎన్డీఎంసీ నిర్ణయించింది. అయితే దీన్ని నిలిపి వేయాలని కోరుతూ 2013 ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో ఇండియన్ హోటల్స్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నవంబర్ 8న కొట్టివేసింది. దీనిపై ఇండియన్ హెటల్స్ సుప్రీంను ఆశ్రయించింది. -
37 ఏళ్లుగా ఐదు నక్షత్రాల హోటల్లోనే
అనారోగ్యంతో మృతిచెందిన కోటీశ్వరుడు - దశాబ్దాలకుపైగా ఐదు నక్షత్రాల న్యూఢిల్లీ: మూడు దశాబ్దాలకుపైగా ఐదు నక్షత్రాల హోటల్ లోనే ఉంటున్న 81 ఏళ్ల వ్యాపారవేత్త చనిపోయాడు. నగరంలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్లోని ఓ విలాసవంతమైన సూట్లో 37 ఏళ్లుగా ఉంటున్న వ్యాపారవేత్త దాడి బల్సారా సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మ్యాక్స్ ఆస్పత్రిలో మృతిచెందాడు. 2009లోనే బల్సారా భార్య చనిపోయిందని, వారికి పిల్లలు లేరని అదనపు పోలీస్ కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి తెలిపారు. మృతుడికి ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నారు. అనారోగ్యం బారినపడిన నాటినుంచి బల్సారా మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రవాస భారతీయుడైన బల్సారా 1991లో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. తన ఉత్పత్తికి హిమాలయన్ అని నామకరణం చేశాడు. తాజ్‌మాన్‌సింగ్ హోటల్లోని 901వ నంబర్‌గల అత్యంత విలాసవంతమైన సూట్లో కాలం గడిపేవాడు. అనేక సంవత్సరాలుగా తమ హోటల్లోనే బస చేస్తుండడాన్ని గమనించిన యాజమాన్యం...బల్సారాతో ఒక ఒప్పందం కుదుర్చుకుని కిరాయి తగ్గించింది. రోజుకు రూ. 15 వేలు చెల్లిస్తే సరిపోతుందని తెలి పింది. ఇలా అతను మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హోటళ్లనే నివాసం మార్చుకున్నాడు. ఇదిలే ఉంచితే ఇతడు మధుమేహ వ్యాధిపీడితుడు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. ఎప్పటిలాగానే బుధవారం రాత్రి 9.30కి భోజనంచేసిన బల్సారా ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. 11.30కు నిద్ర లేచిన బల్సారా మళ్లీ నిద్రపోయాడు. గం2.30 సమయంలో బల్సారా గదికి అటెండెంట్ వచ్చాడు. బల్సారా కదలిక లేకుండా పడి ఉండడాన్ని గమనిం చిన అటెండెంట్... ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశాడు. కాగా బల్సారా గుండెపోటుతోనే చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 250 కోట్లు ఉన్నాయి. అందులో కొంతమొత్తాన్ని తన బంధువులకు, మరి కొంత మొత్తాన్ని విరాళాల కింద ఇవ్వాలని బల్సా రా అనుకున్నట్టు పోలీసులు తెలిపారు. బల్సారా మృతి సహజమరణమనేనని భావిస్తున్నారు.