చీటింగ్ కేసులో రియల్ ఎస్టేట్ ఎండీల అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యునిటెక్ మేనేజింగ్ డైరెక్టర్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 35 కోట్ల మనీలాండరింగ్ కేసులో యూనిటెక్ డైరెక్టర్లు సంజయ్ చంద్ర, సంజయ్ సోదరుడు అజయ్ చంద్ర ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు. కొనుగోలుదారులను మోసం చేయడంతోపాటు, ప్రాజెక్ట్ ప్రారంభించటానికి ముందు సంబంధిత అధికారులు నుంచి అనుమతులు తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
గుర్‌గాంలోని సెక్టార్ 70 లోని ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి లబ్దిదారులకు అందించడంలో యూనిటెక్ విఫలమైంది. దీంతోపాటు, వడ్డీతో సహా బాధితులకు తిరిగి నగదు చెల్లించడంలో కూడా నిర్లక్ష్యం చూపడంతో వీరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో తమ బృందం శుక్రవారం రాత్రి వారిఇంటిపై దాడిచేసి పట్టుకున్నట్టు అధికారి మాధుర్ వర్మ తెలిపారు. వీరిపై 91 ఫిర్యాదులు ఉన్నట్టు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు.
కాగా యూనిటెక్ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ప్లాట్ కొనుగోలు కోసం 39 మంది కొనుగోలు దారులు చెల్లించిన రూ.16.55 కోట్లపై ఏడాదికి 14శాతం వడ్డీతో కలిపి మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించిన సంగతి తెలిసిందే.