న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ యూనిటెక్ నష్టాలు మరింతగా పెరిగాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.290 కోట్లుగా ఉన్న నికర నష్టాలు 2017–18 క్యూ4లో రూ.1,000 కోట్లకు పెరిగాయి. ఆదాయం అధికంగా ఉన్నా నికర నష్టాలు భారీగా పెరిగాయని యూనిటెక్ తెలిపింది. నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండటం, రూ.928 కోట్ల అసాధారణ లావాదేవీ కారణంగా నష్టాలు ఈ స్థాయిలో వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.480 కోట్ల నుంచి రెండు రెట్లు పెరిగి రూ.978 కోట్లకు చేరుకుందని తెలియజేసింది.
పూర్తి సంవత్సరంలో...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.403 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,275 కోట్లకు పెరిగాయని యూనిటెక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,795 కోట్ల నుంచి రూ.2,210 కోట్లకు వృద్ధి చెందింది.
యూనిటెక్ కంపెనీ నష్టాలు రూ.వెయ్యి కోట్లకు పెరగడంతో బీఎస్‌ఈలో యూనిటెక్ షేర్ 6 శాతం పతనమైంది. ఇంట్రాడేలో 7 శాతం నష్టంతో రూ.4.85కు పతనమైన ఈ షేర్ చివరకు 6 శాతం నష్టంతో రూ.4.88 వద్ద ముగిసింది. భారీ రుణాల్లో కూరుకుపోయిన ఈ కంపెనీ చేపట్టిన ప్రాజెక్ట్‌ల్లో తీవ్రంగా జాప్యం జరుగుతుండటంతో కొనుగోలు దారుల నుంచి నిరసనలు, కోర్టు కేసులను ఈ కంపెనీ ఎదుర్కోవలసి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment