సాక్షి, హైదరాబాద్: పూర్తి డబ్బు చెల్లించి బహిరంగ వేలంలో దక్కించుకున్న భూమిని స్వాధీనం చేయడంలో విఫలమైనందుకు యూనిటెక్ కంపెనీకి చెల్లించాల్సిన అసలు రూ.165 కోట్లను తిరిగి ఆ కంపెనీకి చెల్లించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భూమిని స్వాధీనం చేయలేనప్పుడు ఆ కంపెనీ కట్టిన డబ్బును తిరిగిచ్చేయడం తప్పనిసరని, ఇందులో మరో మాటకు తావు లేదంది. రూ.165 కోట్లకు వడ్డీ చెల్లించాలా?లేదా? అన్నది తాము తేలుస్తామంది. రూ.165 కోట్లలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తమ వాటా కింద డబ్బు చెల్లించాలని భావిస్తుంటే, ఆ రాష్ట్రం నుంచి ఆ మేర వసూలు చేసుకోవచ్చునని, అయితే ముందు యూనిటెక్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి తీరాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో వాదనలు వింటామంటూ తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని భూమికి సంబంధించి నిర్వహించిన బహిరంగ వేలంలో యూనిటెక్ సంస్థ రూ.165 కోట్ల బిడ్ వేసి విజేతగా నిలిచింది. అయితే ఈ భూమి యాజమాన్య హక్కులపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది. చివరకు ఈ భూమిని ప్రైవేటు భూమిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈలోపు రాష్ట్ర విభజన జరగడంతో తాము చెల్లించిన రూ.165 కోట్లను వెనక్కి ఇవ్వాలంటూ యూనిటెక్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రూ.660 కోట్లు చెల్లించాలన్న సింగిల్ జడ్జి...
విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు, యూనిటెక్‌కు చెల్లించాల్సిన రూ.165 కోట్లకు వడ్డీ రూ.495.55 కోట్లను కలిపి మొత్తం రూ.660.55 కోట్లను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం తాము వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వేలానికి తమను బాధ్యులుగా చేయడం సరికాదని చెప్పారు.
యూనిటెక్‌ను ఇబ్బందిపెట్టడం సరికాదు...
దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘వడ్డీ సంగతి తర్వాత చూద్దాం.. ముందువారు కట్టిన రూ.165 కోట్లను చెల్లించండి. ఇందులో మరో మాటకు తావు లేవు. భూమిని స్వాధీనం చేయలేనప్పుడు కట్టిన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిందే.’అని స్పష్టం చేసింది. ఏపీఐఐసీ ఆస్తి, అప్పులు విభజన జరగలేదని, అందువల్ల యూనిటెక్‌కు చెల్లించాల్సిన మొత్తంలో ఏపీ వాటా ఉందని సంజీవ్ చెప్పగా, అది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాల్సిన అంశమని, దీనిని సాకుగా చూపు తూ యూనిటెక్‌ను ఇబ్బందిపెట్టడం సరికాదంది. ముందు అసలు తీసుకోవాలని, ఆ తర్వాత వడ్డీ వ్యవహారాన్ని తేలుస్తామని యూనిటెక్‌కు సూచించింది. యూనిటెక్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి స్పందిస్తూ, అసలుతోపాటు వడ్డీకి సైతం తాము అర్హులమంటూ అందుకు సంబంధించిన నిబంధనలను చదివి వినిపించారు.
రూ.165 కోట్లు తిరిగి చెల్లించాల్సిందే
Published Tue, Dec 4 2018 3:05 AM | Last Updated on Tue, Dec 4 2018 3:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment