న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్ పగ్గాలను కేంద్రం తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఇందుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలన్నీ జరక్కుండా ఉండాల్సిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అంగీకరించిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రస్తుతం జైల్లో ఉన్న యూనిటెక్ చీఫ్ సంజయ్‌చంద్ర... కంపెనీ ఆస్తుల విక్రయానికి సంబంధించి చర్చలను పునరుద్ధరించగలుగుతారు. ఇందుకు అనుగుణంగా న్యాయవాదులు, కంపెనీ అధికారులతో సంజయ్‌చంద్ర చర్చించడానికి జైలు అధికారులు వీలు కల్పించాల్సి ఉంటుంది.
కేసు డైరీ ఇదీ...
♦ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించినప్పటికీ... ప్రాజెక్టును ప్రారంభించడం లేదన్న ఆరోపణలపై యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, ఆయన సోదరుడు అజయ్ చంద్రలను ఆర్థిక నేరాల విభాగం ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ చేసింది.
♦ సంజయ్ చంద్ర బెయిల్‌కు డిసెంబర్‌లోగా రూ.750 కోట్లు డిపాజిట్ చేయాలని అక్టోబర్ 30న సుప్రీం యూనిటెక్‌ని ఆదేశించింది.
♦ అయితే నిర్వహణ లోపాలు, మేనేజ్‌మెంట్ నిధులు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో కంపెనీ యాజమాన్య బాధ్యతలను తమ చేతికి అప్పగించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) పిటిషన్ దాఖలు చేసింది.
♦ ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ గడచిన శుక్రవారం (డిసెంబర్ 8) కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ యాజమాన్య బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగించే దిశగా యూనిటెక్ 8 మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని, వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచించింది. తాజా ఆదేశాలపై సమాధానం ఇవ్వాలని అటు యూనిటెక్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.
♦ దీనిని యూనిటెక్ తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో కంపెనీ కేసు విచారణ జరుగుతోందని ఎన్‌సీఎల్‌టీకి యూనిటెక్ నివేదించింది. ఇతరత్రా న్యాయస్థానాలేవీ కంపెనీపై బలవంతంగా ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతిని తెలియజేసింది. తాజా ఉత్తర్వుల వల్ల తాము సుప్రీం కోర్టుకు రూ. 750 కోట్లు డిపాజిట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. అయితే, మధ్యంతర ఆదేశాలను రద్దు చేయడానికి ఎన్‌సీఎల్‌టీ నిరాకరించింది.
♦ దీనితో సోమవారం యూనిటెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
♦ ఆదేశాలు ఇచ్చే ముందు అటు కేంద్రం ఇటు ట్రిబ్యునల్ తనను సంప్రదించి ఉండాల్సిందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా విజ్ఞప్తి మేరకు కేసు విచారణను నేటికి (బుధవారం) వాయిదా వేసింది.
♦ ఈ కేసులో ఆయా పరిణామాలు జరక్కుండా ఉండిఉండాల్సిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అంగీకరించడంతో తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్న విషయం ఉన్నట్లు అంగీకరించినందుకు అటార్నీ జనరల్‌ను ధర్మాసనం అభినందించింది. అటు ధర్మాసనంపై ఇటు గృహ కొనుగోలుదారులపై ఉండే ఒత్తిడిని ఆయన వైఖరి తగ్గిస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని వ్యాఖ్యానించింది.
♦ ఈ కేసులో దాదాపు 20,000 గృహ కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న విమర్శ ఉంది. యూనిటెక్ రుణభారం రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయింది. సుమారు 70 ప్రాజెక్టుల్లో దాదాపు 16,000 ఇళ్లను కొనుగోలుదారులకు అందించాల్సి ఉంది.
షేర్ 14 శాతం డౌన్!
గత రెండు రోజులుగా నేషనల్‌స్టాక్ ఎక్స్చేంజిలో పెరుగుతూ వస్తున్న యూనిటెక్ షేర్ ధర తాజా వార్తల నేపథ్యంలో భారీగా పడింది. 14 శాతం (రూ.1.05) నష్టపోయి 6.60 వద్ద ముగిసింది. ఒక దశలో 16 శాతంపైగా షేర్ ధర పతనమైంది.
Comments
Please login to add a commentAdd a comment