ఇక నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్
బార్సిలోనా: ఎట్టకేలకు మొబైల్ దిగ్గజం నోకియా కూడా ఆండ్రాయిడ్ బాట పట్టింది. భారత్ వంటి ప్రధాన మార్కెట్లలో చౌక స్మార్ట్ఫోన్లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో నోకియా ఈ కొత్త స్మార్ట్ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. మార్పులు చేసిన ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్( ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్-ఏఓఎస్‌పీ)తో ప్రవేశపెట్టిన ఈ మొబైల్స్‌కు ‘ఎక్స్’ సిరీస్‌గా పేరు పెట్టింది. ఎక్స్, ఎక్స్ ప్లస్, ఎక్స్ఎల్ అనే మూడు మోడళ్లు ఇందులో లభ్యమవుతాయి.
వీటి ధరలు వరుసగా 89, 99, 109 యూరోలుగా ఉంటాయని(పన్నులు కలపకుండా) కంపెనీ వెల్లడించింది. అంటే ఎక్స్ మోడల్ రేటు భారత్ కరెన్సీలో దాదాపు రూ.7,600. చౌక స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో అనూహ్య వృద్ధి నమోదవుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఎక్స్ సిరీస్‌ను ప్రవేశపెడుతున్నట్లు నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఎలాప్ పేర్కొన్నారు. ఎక్స్ మోడల్‌ను త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని, మిగతా రెండు ఫోన్లను ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
మరో రెండు ఫోన్లు...
ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఎంట్రీ లెవెల్ మొబైల్, ఆశా 230 పేరుతో మరో ఫోన్‌ను కూడా నోకియా ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ మొబైల్ ధర 29 యూరోలు కాగా, ఆశా 230 ఫోన్ 45 యూరోలకే లభిస్తుందని ఎలాప్ చెప్పారు. తక్షణం ఈ రెండు ఫోన్లను భారత్, ఆసియా-పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆశా టచ్ ఫోన్లలో అత్యంత చౌక మొబైల్ ఇదేనని.. సింగిల్, డ్యూయల్ సిమ్ ఆప్షన్స్‌తో లభిస్తుందని ఎలాప్ వివరించారు. ఇప్పుడు నోకియా 220 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్‌తో పాటు ఆశా సిరీస్, ఎక్స్ సిరీస్, లుమియా... ఇలా నాలుగు స్థాయిల్లో తమ కంపెనీ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లయిందని పేర్కొన్నారు.
ఆండ్రాయిడ్ హవాయే కారణం...
ఆండ్రాయిడ్ ఓఎస్ హవాతో స్మార్ట్ఫోన్ల విభాగంలో నోకియా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్ రావడం ఖాయమన్న వార్తలు ఇటీవల జోరందుకున్నాయి కూడా. ప్రస్తుతం నోకియా విండోస్ ఆధారిత స్మార్ట్ఫోన్లను(ప్రధానంగా లుమియా సిరీస్) మాత్రమే విక్రయిస్తోంది. నోకియాను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం, మరికొద్ది రోజుల్లో ఈ టేకోవర్ పూర్తికానున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లను ప్రవేశపెట్టడం గమనార్హం. కాగా, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాల ప్రకారం.. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో గతేడాది డిసెంబర్ క్వార్టర్లో 78.1 శాతం స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైనట్లు అంచనా. ఇదే కాలంలో మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ ఓఎస్ ప్లాట్‌ఫామ్ ఉన్న స్మార్ట్ఫోన్లు విక్రయాలు 3 శాతమేనని గణాంకాలు చెబుతున్నాయి.
బ్లాక్‌బెర్రీ మెసెంజర్ కూడా...
విఖ్యాత బ్లాక్‌బెర్రీ మెసెంజర్(చాటింగ్ అప్లికేషన్-బీబీఎం) త్వరలో విండోస్ ఫోన్(లుమియా సిరీస్ ఇతరత్రా), నోకియా ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లలోనూ లభించనుంది. గతేడాది అక్టోబర్‌లో ఈ కెనడా మొబైల్ దిగ్గజానికి చెందిన బీబీఎం యాప్‌ను ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ డివైజ్‌లకు అనువుగా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దాదాపు 4 కోట్ల హ్యాండ్సెట్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. ‘నోకియా ఫోన్లో బీబీఎం యాప్‌ను ప్రీలోడెడ్‌గా అందించనుండటం పట్ల మేం చాలా ఉత్సుకతతో ఉన్నాం. కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ఎక్స్ సిరీస్‌లో ఈ యాప్‌ను ముందుగా ప్రవేశపెడతాం. బీబీఎం సమూహంలోనికి నోకియా ఎక్స్ యూజర్లను ఆహ్వానిస్తున్నాం’ అని బ్లాక్‌బెర్రీ ప్రెసిడెంట్(గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్) జాన్ సిమ్స్ పేర్కొన్నారు. శామ్సంగ్, యాపిల్, నోకియా స్మార్ట్ఫోన్లతో విపరీతమైన పోటీ కారణంగా బ్లాక్‌బెర్రీ అమ్మకాలు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్స్ సిరీస్ ప్రత్యేకతలు ఇవీ...
నోకియా ఎక్స్, ఎక్స్ ప్లస్‌లు రెండూ 4 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో లభిస్తాయి.
వీటిలో వెనుకవైపున 3 మెగా పిగ్జెల్ కెమేరా ఉంది.
ఎక్స్ ప్లస్‌కు 768 ఎంబీ ర్యామ్, ఎక్స్ మోడల్లో 512 ఎంబీ ర్యామ్‌ను అమర్చారు.
ఎక్స్ ఎల్ మోడల్లో 5 అంగుళాల టచ్ స్క్రీన్, వెనుకవైపున 5 ఎంపీ ఆటోఫ్లాష్ కెమేరా, ముందువైపు 2 ఎంపీ కెమేరా ఉంది. ర్యామ్ 768 ఎంబీ.
మూడు ఫోన్లలో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. ఇంటర్నల్ మెమరీ 4జీబీ, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ సదుపాయం. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ డ్యూయల్ కోర్
1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌తో ఇవి లభిస్తాయి.
మైక్రోసాఫ్ట్ సేవలు, హియర్ మ్యాప్స్ వంటి నోకియా ప్రత్యేక అప్లికేషన్స్‌తో పాటు వీటిలో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా పనిచేస్తాయి.