Nominations Research
-
ఇక ఏకగ్రీవమే ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండళ్ల ద్వైవార్షిక ఎన్నికలకు వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయి. ఖాళీలకు తగిన సంఖ్యలోనే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినందున, ఈ నెల 19న ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసన సభ కార్యదర్శి ఓం ప్రకాశ్ మంగళవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా బీకే. హరిప్రసాద్, రాజీవ్ గౌడ, బీజేపీ అభ్యర్థిగా ప్రభాకర కోరె, జేడీఎస్ అభ్యర్థిగా కుపేంద్ర రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగు ఖాళీలకు నలుగురే నామినేషన్లు దాఖలు చేసినందున, వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. స్వతంత్ర అభ్యర్థులుగా మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, నిబంధనల మేరకు లేనందున తిరస్కరించారు. శాసన మండలిలోని ఏడు ఖాళీలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా డాక్టర్ జీ. పరమేశ్వర, జయమ్మ బాలరాజ్, బోసు రాజు, హెచ్ఎం. రేవణ్ణ, బీజేపీ అభ్యర్థిగా కేఎస్. ఈశ్వరప్ప, జేడీఎస్ అభ్యర్థిగా శరవణ, ఈ రెండు పార్టీలు బలపరిచిన మరో అభ్యర్థి యుగంధర్ నామినేషన్లు దాఖలు చేశారు. అదనపు అభ్యర్థులెవరూ రంగంలో లేనందున వీరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం వీరంతా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
ప్రధాన అభ్యర్థులంతా బరిలోనే 31 నామినేషన్ల తిరస్కరణ ఇక ఉపసంహరణలపైనే దృష్టి ఒంగోలు, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరో అంకం ముగిసింది. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు కలిపి మొత్తం 497 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొంత మంది రెండు మూడు సెట్లు దాఖలు చేయగా, మరికొంతమంది డమ్మీ నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. ప్రధాన అభ్యర్థుల నామినేషన్లన్నీ చెల్లుబాటవడంతో..డమ్మీ అభ్యర్థులుగా వేసిన పలువురు నామినేషన్లను జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించారు.ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రెండేసి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నాలుగు నామినేషన్లకు సంబంధించి ప్రతిపాదకుల వివరాలు సరిగా లేకపోవడంతో తిరస్కరించారు. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సీపీఎంకు సంబంధించి రెండు డమ్మీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సంతనూతలపాడులో సీపీఎం డమ్మీ నామినేషన్ తిరస్కరించారు. కనిగిరిలో మొత్తం 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అద్దంకిలో ఒక డమ్మీ నామినేషన్, చీరాలలో మూడు నామినేషన్లు తిరస్కరించారు. అయితే మరో అభ్యర్థికి సంబంధించి అభ్యంతరం వ్యక్తమైంది. తాము అతనిని ప్రతిపాదించలేదంటూ పలువురు తహసీల్దారు వద్ద అభ్యంతరం వ్యక్తం చేయగా దానిపై తుది నిర్ణయం మంగళవారం ఉదయం ప్రకటించనున్నారు. పర్చూరులో ఒక నామినేషన్, మార్కాపురంలో 5, కొండపిలో ఒకటి, కందుకూరులో ఒకటి, దర్శిలో ఒకటి, గిద్దలూరులో ఒకటి, వై.పాలెంలో 4 నామినేషన్లు తిరస్కరించారు. దీంతో మొత్తం 31 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 466 నామినేషన్లు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో మంగళ, బుధ వారాల్లో భారీగా నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అత్యధికంగా కనిగిరిలో 50 నామినేషన్లు, మార్కాపురం అసెంబ్లీకి 38 నామినేషన్లు అర్హమైనవిగా ఉన్నాయి.