- ప్రధాన అభ్యర్థులంతా బరిలోనే
- 31 నామినేషన్ల తిరస్కరణ
- ఇక ఉపసంహరణలపైనే దృష్టి
ఒంగోలు, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరో అంకం ముగిసింది. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు కలిపి మొత్తం 497 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొంత మంది రెండు మూడు సెట్లు దాఖలు చేయగా, మరికొంతమంది డమ్మీ నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. ప్రధాన అభ్యర్థుల నామినేషన్లన్నీ చెల్లుబాటవడంతో..డమ్మీ అభ్యర్థులుగా వేసిన పలువురు నామినేషన్లను జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించారు.ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రెండేసి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నాలుగు నామినేషన్లకు సంబంధించి ప్రతిపాదకుల వివరాలు సరిగా లేకపోవడంతో తిరస్కరించారు.
ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సీపీఎంకు సంబంధించి రెండు డమ్మీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సంతనూతలపాడులో సీపీఎం డమ్మీ నామినేషన్ తిరస్కరించారు. కనిగిరిలో మొత్తం 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అద్దంకిలో ఒక డమ్మీ నామినేషన్, చీరాలలో మూడు నామినేషన్లు తిరస్కరించారు. అయితే మరో అభ్యర్థికి సంబంధించి అభ్యంతరం వ్యక్తమైంది. తాము అతనిని ప్రతిపాదించలేదంటూ పలువురు తహసీల్దారు వద్ద అభ్యంతరం వ్యక్తం చేయగా దానిపై తుది నిర్ణయం మంగళవారం ఉదయం ప్రకటించనున్నారు. పర్చూరులో ఒక నామినేషన్, మార్కాపురంలో 5, కొండపిలో ఒకటి, కందుకూరులో ఒకటి, దర్శిలో ఒకటి, గిద్దలూరులో ఒకటి, వై.పాలెంలో 4 నామినేషన్లు తిరస్కరించారు.
దీంతో మొత్తం 31 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 466 నామినేషన్లు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో మంగళ, బుధ వారాల్లో భారీగా నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అత్యధికంగా కనిగిరిలో 50 నామినేషన్లు, మార్కాపురం అసెంబ్లీకి 38 నామినేషన్లు అర్హమైనవిగా ఉన్నాయి.