Non communicable Diseases
-
బతికుండగానే... మృతుల జాబితాలోకి..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) సర్వే తప్పుల తడకగా జరుగుతోంది. ఈ సర్వే లక్ష్యాన్ని వైద్య సిబ్బంది నీరుగారుస్తున్నారు. ఇంటింటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చేసేస్తున్నారు. దీంతో సర్వేలో తప్పులు దొర్లుతున్నాయి. బతికున్న వారిని కూడా మృతుల జాబితాలోకి చేర్చారు. చిత్తూరు జిల్లాలో ఈ సర్వే నత్తనడకన జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు కలిసి ఈసర్వే చేయాల్సి ఉంది. నాన్ కమ్యూనికబుల్ డిసిజెస్ (ఎన్సీడీ) అయిన బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి కేసులను గుర్తించాలి. అయితే వీరంతా ఇంటింటి సర్వేకు వెళ్లకుండా వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. కొంతమందికి ఫోన్ చేసి ఓటీపీలతో పని కానిచ్చేస్తున్నారు. ఇక చేసే ఓపికలేని వారు చనిపోయారని, పరి్మనెంట్‌గా మైగ్రేట్, తాత్కాలిక మైగ్రేట్, సీబ్యాక్ సర్వే జాబితాలోకి చేరుస్తున్నారు. తాజాగా చిత్తూరులోని సత్యనారాయణపురంలో నివాసముంటున్న కటికపల్లి నారాయణ స్వామి, కటిక పల్లి జ్యోతి బతికుండగానే చనిపోయిన వారి జాబితాలోకి చేరారు. ఇలా ఈ దంపతులే కాదు.. చాలా మందిని చనిపోయిన జాబితాలోకి చేర్చడంతో సర్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిoది. కాగా గత ప్రభుత్వ హయాంలో వైద్య సేవలతో పాటు సర్వేలన్నీ పకడ్బందీగా జరిగేవనీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైద్యసేవలతోపాటు సర్వేలు కుంటుపడ్డాయని పలువురు విమర్శిస్తున్నారు. -
ఎన్సీడీ సమస్య?.. 35 ఏళ్లు నిండినవారికి అనారోగ్యం తప్పదా? ఎందుకిలా?
ఎన్సీడీ.. సందేహం వద్దు. ఓసీడీ కాదు, ఇది ఎన్సీడీ. అంటే...నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ). ఆధునిక జీవనశైలిలో మన చుట్టూ పొంచి ఉన్న అనారోగ్యాల సమూహం ఇది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు, కానీ ఒక దగ్గర, ఒక వాతావరణంలో పనిచేసే వారికి ఏకకాలంలో ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు నిండితే చాలు... నేనున్నానంటూ ఈ సమూహంలోని ఏదో ఒక అనారోగ్యం తొలుత పలకరిస్తుంది. ఆ తర్వాత మరిన్ని అనారోగ్యాలకు మార్గాలను సుగమం చేస్తుంది. మనదేశంలో ఏడాది కిందట ‘ఇల్నెస్ టూ వెల్నెస్’ ప్రచారంలో భాగంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ముప్పై ఐదేళ్లు నిండిన వారిని ఏదో ఒక ఎన్సీడీ అనారోగ్యం వేధిస్తోంది. వాటిలో హైపర్ టెన్షన్, డైజెస్టివ్ డిసీజెస్, డయాబెటిస్ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయి. క్యాన్సర్ కూడా ఈ ఎన్‌సీడీల్లో ఉంటోంది. కానీ దాని శాతం అత్యంత తక్కువగానే ఉన్నట్లు ‘ఇల్నెస్ టూ వెల్నెస్’ నివేదిక సమాచారం. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారి) సంయుక్తంగా నిర్వహించిన ‘ఇల్‌నెల్ టూ వెల్నెస్’ సర్వేలో 21 రాష్ట్రాల్లో రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా వ్యక్తులను సంప్రదించారు. సమతుల్యత లోపించిన ఆహారం, ఆల్కహాల్ సేవనం, ధూమపానం ప్రత్యక్ష కారణాలవుతున్నాయి. వీటికి దారితీస్తున్న పరోక్ష కారణాల మీద కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి, తక్షణ ఉపశమనం కోసం కొంతమంది విపరీతంగా ఆహారం తీసుకుంటున్నారు. అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కాదు. జిహ్వకు రుచి కోసం, మెదడుకు సంతృప్త భావన కోసం ప్రాసెస్డ్ షుగర్స్‌తో చేసిన జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కొద్ది నెలల్లోనే దేహం సెంట్రల్ ఒబేసిటీ (నాభి వలయం చుట్టు కొలత పెరగడం) కి లోనవడం జంక్‌ఫుడ్ వల్లనేనంటారు నిపుణులు. దీనికి తోడు వ్యాయామం తగ్గిపోవడం కూడా కారణమే. ఇక వర్క్ షెడ్యూళ్లు, పని వాతావరణాలు మెదడు, నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇవి హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు దారి తీస్తున్నాయి. యాభై ఏళ్ల కిందట ఎన్సీడీ సమస్యలు ఇప్పటికిప్పుడు ఊడిపడిన అనారోగ్యాలు కాదు, కానీ ఇప్పుడు వాటి శాతం ఏడాదికేడాదికీ గణనీయంగా పెరుగుతోంది. 1970 దశకంలో రెండు శాతం ఉంటే ఇప్పుడు 35 నుంచి 40 శాతంగా ఉంది. ఇది ఇలా ఉంటే... స్ట్రోక్ (పక్షవాతం) కేసులు గడచిన ముప్పై ఏళ్లలో గణనీయంగా పెరుగుతున్నాయని న్యూఢిల్లీలోని ‘లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్’ న్యూరాలజీ హెవోడీ ప్రొఫెసర్ డాక్టర్ రాజిందర్ కె ధమిజ తెలియచేశారు. వృత్తిఉద్యోగవ్యాపారాల్లో రోజుకు ఎంత ఉత్పాదకతను సాధించామనే గణనతోపాటు రోజుకు ఎంత ఆహారం తింటున్నాం, ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామోననే స్పృహ కలిగి ఉండడం, అలాగే ఎంత వ్యాయామం చేశామనే ఆలోచన కూడా ఉండాలి. ఎన్సీడీ సమస్యలతో ఎదురయ్యే తదనంతర పరిణామాలను నివారించాలంటే ముప్పైలలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఒత్తిడి నుంచి బయటపడడానికి ధూమపానం, ఆల్కహాల్‌కు బదులుగా రోజూ జిమ్ లేదా ఇతర ఫిజికల్ యాక్టివిటీ, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను ఆశ్రయించడం ఆరోగ్యకరం. -
నెల్లూరుకు షుగరు, బీపీ!
* వందకు 15 మంది మధుమేహ బాధితులు * రక్తపోటు విషయంలోనూ అదే తీరు * ఆ తర్వాత స్థానంలో కృష్ణా జిల్లా * పల్లెల్లోనూ జీవన శైలి మార్పుతో జబ్బులు పెరిగినట్లు ప్రభుత్వ సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: షుగరు, బీపీ రోగులకు నిలయాలుగా ఉన్న నగరాల జీవన శైలి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా ఇప్పటిదాకా హైదరాబాద్ ఉండేది. ఇప్పుడా స్థానాన్ని నెల్లూరు, విజయవాడ, విశాఖ నగరాలు అందిపుచ్చుకునే దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రభుత్వం నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ-జీవన శైలి జబ్బులు) మీద జరిపిన సర్వేలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని పల్లెల్లో డయాబెటిక్ కేసులు భారీగా నమోదయ్యాయి. హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) కేసులూ అధికంగా నమోదు కావడం విస్మయ పరుస్తోంది. జీవన ప్రమాణాలు తగ్గడమే కాకుండా, కుటుంబ ఆర్థిక స్థితిగతులు దారుణంగా దెబ్బతింటున్నట్టు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని చెబుతున్నారు. కలవరపెడుతున్న రక్తపోటు రాష్ట్రంలో రక్తపోటు రోగులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు, కృష్ణా ప్రథమ స్థానం సంపాదించుకున్నాయి. నెల్లూరులో ప్రతి వంద మందిలో 14 మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, కృష్ణా జిల్లాలో వంద మందికి 11 మంది ఉన్నట్టు ప్రభుత్వ సర్వేలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా మధుమేహం, హైపర్ టెన్షన్లపై 8 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో బీపీ, మధుమేహ బాధితులు ఎక్కువున్నట్టు తేలింది. నెల్లూరు జిల్లాలో ప్రతీ వంద మందిలో 15 మందికి మధుమేహం ఉంది. కృష్ణ్లాలో ప్రతి వంద మందికి 11.2 మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని స్పష్టమైంది. చిత్తూరులో అతి తక్కువ డయాబెటిక్ కేసులు నమోదయ్యాయి. వందకు కేవలం 4.95 మంది ఉన్నట్టు అధికార వర్గాలు తేల్చాయి. కృష్ణా జిల్లాలో 15.07 లక్షల మందికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించగా 1,69,429 మందికి నిర్ధారణ అయ్యింది. నెల్లూరు జిల్లాలో ఇదే పరీక్షను 6.22 లక్షల మందికి నిర్వహించగా 98,953 మందికి నిర్ధారణ కావడం గమనార్హం.